ప్రముఖ హీరో అజ్మల్ అమీర్ (Ajmal Ameer) అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడంటూ ఓ వీడియో క్లిప్ నెట్టింట వైరలయింది. హద్దులు దాటి సంభాషించాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఇదంతా ఏఐ మాయ అని.. వాటిని కొట్టిపారేశాడు. ఇలాంటి ఫేక్ వీడియోలతో నా కెరీర్ నాశనం చేయలేరు అని వీడియో రిలీజ్ చేశాడు. ఈ క్రమంలో తమిళ హీరోయిన్ నర్విని దేరి.. అజ్మల్ అలాంటి దుర్మార్గుడే అంటూ మీడియా ముందుకు వచ్చింది.
హీరోయిన్ కోసం వెతుకులాట
తమిళ యూట్యూబ్ ఛానల్ ట్రెండ్ టాక్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అజ్మల్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన మొదటి వ్యక్తి నేనే! అజ్మల్ అరాచకాల గురించి గతంలో చెప్పాను. అసలేం జరిగిందంటే.. 2018లో చెన్నైలోని ఓ మాల్‌లో అజ్మల్‌ను తొలిసారి కలిశాను. అప్పటికే నేనో సినిమా చేస్తున్నాను. అజ్మల్ ఒక యాక్టర్ అని నా ఫ్రెండ్ వల్ల తెలిసింది. అజ్మల్.. తన నెక్స్ట్ సినిమాకు హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు చెప్పాడు.
ఆడిషన్‌కు రమ్మని ఆహ్వానం
నన్ను యాక్ట్ చేయమని అడిగాడు. అలా ఇద్దరం మాట్లాడుకుని, ఫోన్ నెంబర్లు తీసుకుని వెళ్లిపోయాం. తర్వాత నాకు వాట్సాప్‌లో ఆడిషన్‌కు రమ్మని పిలిచాడు. నేను ఆ మరుసటి రోజే డెన్మార్క్ వెళ్లాల్సి ఉంది, ఇప్పుడు రాలేనని చెప్పాను. నువ్వు వస్తే సినిమా టీమ్ అందరినీ కలుసుకోవచ్చని ఒప్పించాడు. అయినా ఆడిషన్, సెలక్షన్.. ఒకే రోజులో ఎలా పూర్తవుతాయని ప్రశ్నిస్తే తాను చూసుకుంటానన్నాడు.

అక్కడికి వెళ్లగానే..
సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా సమయం ఉందని చెప్పాడు. ఆడిషన్‌కు వెళ్లేటప్పుడు నా ఫ్రెండ్స్ లేదా బంధువుల్లో ఎవరో ఒకర్ని వెంటపెట్టుకుని వెళ్తాను. కానీ, ఆరోజు సడన్‌గా వెళ్లాల్సి వచ్చేసరికి ఒంటరిగా వెళ్లాను. అజ్మల్ పంపిన లొకేషన్‌కు వెళ్లగానే కొంత అసౌకర్యంగా అనిపించింది. ఆయన చెప్పిన రూమ్ దగ్గరికెళ్లి డోర్ కొట్టగా అజ్మల్ తలుపు తీశాడు. మిగతావారేరి? అని అడిగితే అందరూ బయటకు వెళ్లారన్నాడు.
రూమ్‌లో ఒక్కడే..
వారు వచ్చేవరకు కింద వెయిట్ చేస్తానంటే ఆయన ఒప్పుకోలేదు. ఏదో తప్పు జరగబోతోంది అని నా మనసు కీడు శంకించింది. తినడానికి ఏదో ఇస్తే వద్దని తిరస్కరించాను. ఇంకో 20 నిమిషాల్లో నా నుంచి మెసేజ్ రాకపోతే వెంటనే ఫోన్ చేయ్ అని నా ఫ్రెండ్‌కు మెసేజ్ పెట్టాను. మరోవైపు అజ్మల్.. నా బ్యాగు తీసుకుని పక్కనపెట్టాడు. ఏం చేయాలో అర్థం కాక వాష్‌రూమ్‌కి వెళ్లి అక్కడే కాసేపు ఉండిపోయాను. బయటకు రాగానే పాటలు పెట్టి నా చేయి పట్టుకున్నాడు.
అమ్మాయిలు నా వెంట పడతారు
డ్యాన్స్ చేద్దామన్నాడు. వెంటనే అతడిని దూరం నెట్టి.. మీ ఉద్దేశం ఏంటో నాకర్థమైంది. నేను దానికోసమైతే రాలేదు అని ముఖం మీదే చెప్పాను. అందుకు అజ్మల్.. ఏం మాట్లాడుతున్నావ్? నేను హ్యాండ్సమ్.. నా వెనక ఎంతమంది అమ్మాయిలు పడతారో తెలుసా? అంటూ గొప్పలుపోయాడు. అయితే నాకేంటి? నాకిదంతా నచ్చదని కరాఖండి చెప్తూ ఉన్నా.. సడన్‌గా హత్తుకునేందుకు ప్రయత్నించాడు.
నన్ను చంపాకే ముట్టు
నేను అడ్డు చెప్పాను. నన్నేదైనా చేయాలంటే అది నన్ను చంపాకే చేసుకో అన్నాను. అప్పుడే తనకు ఫోన్‌కాల్ వచ్చింది. వెంటనే నేను క్యాబ్ డ్రైవర్‌కు ఫోన్ చేసి రెడీగా ఉండమన్నాను. నాతోపాటు సిస్టర్స్ వచ్చారు, వారు కింద నాకోసం వెయిట్ చేస్తున్నారని అబద్ధం చెప్పాను. నేను వెళ్లకపోతే వారే నన్ను వెతుక్కుంటూ ఇక్కడివరకు వస్తారన్నాను. ఇంతలో రూమ్ బాయ్ కాలింగ్ బెల్ కొట్టాడు. అజ్మల్ డోర్ తలుపు తీయగానే వెంటనే అక్కడి నుంచి పారిపోయి తప్పించుకున్నాను.
చాలామందితో ఇలాగే
ఇంత జరిగాక కూడా నాకు మెసేజ్ చేయడం మానలేదు. మళ్లీ కలుస్తావా? అని అడుగుతూ ఉంటాడు. అజ్మల్ చాలామంది అమ్మాయిలతో ఇలాగే ప్రవర్తించాడు. ఇదంతా జరిగినప్పుడు నా చదువు, జీవితంపైనే ధ్యాస పెట్టాను. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అని నర్విని చెప్పుకొచ్చింది. నర్విని.. ఉయిర్వారై ఇనింతాయి, సినంకోల్ అనే తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.
చదవండి: శ్రీజకు మళ్లీ అన్యాయం? 'మేమేం పాపం చేశాం? ఎందుకింత వివక్ష'


