
పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఓజీ'లో నారా ఫ్యామిలీకి కాబోయే కోడలు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నటుడు నారా రోహిత్‌కు కాబోయే సతీమణి శిరీషా (శిరీష లేళ్ల) ఈ చిత్రంలో ఒక కీలకపాత్రలో నటించినున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని తెలిసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
'ప్రతినిధి2' సినిమాలో నారా రోహిత్ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గతేడాదిలో నిశ్చితార్థం జరిగింది. త్వరలో ఏడడుగుల బంధంతో ఒకటి కానున్నారు. భైరవం సినిమాతో నారా రోహిత్, ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే.

సినిమాలపై మక్కువతో ఆమె హైదరబాద్‌లోని తన అక్క ప్రియాంక వద్ద ఉంటూ సినిమా ఛాన్స్‌ల కోసం ప్రయత్నాలు చేస్తుండగా నారా రోహిత్‌తో ప్రతినిధి2లో అవకాశం దక్కింది. అలా వారి పరిచయం కాస్త పెళ్లి వైపు అడుగులు పడ్డాయి. వివాహానికి ఇంకా సమయం ఉండటంతో ఆమె పలు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓజీలో ఛాన్స్ దక్కడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం.