Nani: అప్పుడు డైరెక్టర్‌ను చూసి షాకయ్యాను: నాని

Nani About Shyam Singha Roy Movie And Upcoming Projects - Sakshi

నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన చిత్రం 'శ్యామ్ సింగ రాయ్'. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా బుధవారంనాడు నాని మీడియాతో ముచ్చటించారు.

► నేను మామూలుగానే థియేటర్‌లో సినిమా చూసేందుకు ఇష్టపడతాను. నేను సత్యం థియేటర్ గురించి ఎక్కువ మాట్లాడతానని అందరికీ తెలుసు. థియేటర్లో వెనకాల నిల్చుని సినిమా చూస్తుంటాను. రెండేళ్ల తరువాత ఇలా శ్యామ్ సింగ రాయ్‌తో వస్తున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.

► కథలో చాలా దమ్ముంటేనే పీరియడ్ సినిమాలు తీయాలి. శ్యామ్ సింగ రాయ్‌కి అద్భుతమైన కథ దొరికింది. కథే కాకుండా నటీనటులు, మంచి టెక్నీషియన్స్ కూడా దొరికారు. శ్యామ్ సింగ రాయ్ సినిమాతో ఎన్నో మెమోరీస్ ఉన్నాయి. ఇలా ప్రొడక్ట్ మొత్తం పూర్తయిన తరువాత చూసుకుంటే మళ్లీ ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. సినిమా పట్లా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

► కమల్ హాసన్ సినిమా నాయకుడుకి, ఈ మూవీకి సంబంధం ఉండదు. కానీ కమల్ గారి అభిమానిని అవ్వడంతో ఎక్కడో చోట ఆయన ప్రభావం ఉంటుంది. కానీ కథ పరంగా ఎక్కడా పోలిక ఉండదు. శ్యామ్ సింగ రాయ్ కోసం ప్రత్యేకంగా వెయిట్ పెరగడం వంటివి ఏం చేయలేదు. కానీ మీకు అలా అనిపిస్తుంది. నడిచే విధానం, మాట్లాడే తీరును బట్టి ఆ తేడాను మనం చూపించొచ్చు.

► క్యాస్ట్యూమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్స్ మాత్రం చాలా కష్టపడ్డారు. జూనియర్ ఆర్టిస్ట్‌ల విషయంలో కూడా ఎంతో శ్రద్ద తీసుకున్నారు. ప్రతీ రోజూ రెండొందల మంది ఉండేవారు. వారికి కూడా స్పెషల్ క్యాస్టూమ్స్ డిజైన్ చేశారు.

► ఇందులో డైరెక్టర్‌గా పని చేశాను. నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. కానీ వాసుకి చాలా కంఫర్ట్స్ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాలను మాత్రం ఇందులో చూపించలేదు. ఎంటర్టైనింగ్ గానే చూపించాం.

► శ్యామ్ సింగ రాయ్‌లో నాలుగు ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిని ఎపిసోడ్స్‌లా చూడటం నాకు నచ్చదు. కానీ అవి వచ్చినప్పుడు కచ్చితంగా గూస్ బంప్స్ మూమెంట్స్ అవుతాయి. వాటిని ఈ కథలో మలిచిన తీరు అద్భుతంగా ఉంటాయి. అవి స్టోరీ మీద ఎంతో ప్రభావాన్ని చూపుతాయి.

► జెర్సీ డైరెక్టర్ గౌతమ్‌లోని క్వాలిటీస్..శ్యామ్ సింగ రాయ్ దర్శకుడు రాహుల్‌లో చూశాను. చిన్న చిన్న వాటికి చాలా ఎగ్జైట్ అవుతారు. ఆ వయసులో ఆ మెచ్యూరిటీ అరుదుగా ఉంటుంది. చాలా సెటిల్డ్‌గా ఉంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాహుల్‌ను అలా చూసి షాక్ అయ్యాను. అంతలా ఎప్పుడూ మాట్లాడలేదు. సెటిల్డ్‌గా ఉండే వారంతా కూడా వారి ఎనర్జీని అలా దాచుకుంటారేమో. ఆయనకు ఎంతో క్లారిటీ ఉంటుంది. ప్రతీది డీటైల్డ్‌గా చెప్పి మరీ చేయించుకుంటారు. తనకు లిటరేచర్ మీద బాగా గ్రిప్ ఉంది. అలాంటి వ్యక్తి పీరియడ్ సినిమా తీస్తే ఇంకెంత డీటైల్‌గా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

► ఎంసీఏ సినిమాకు టక్ జగదీష్ సినిమాకంటే తక్కువగా రివ్యూలు వచ్చాయి. కానీ నా కెరీర్‌లో ఎంసీఏ బ్లాక్ బస్టర్ హిట్. అయితే వీ, టక్ జగదీష్ సినిమాల పట్ల నిర్మాతలు, అమెజాన్ కూడా హ్యాపీగా ఉంది. హయ్యస్ట్ వ్యూస్, సబ్ స్క్రిప్షన్స్ పెరిగాయని అన్నారు. కానీ ఇక్కడ మీకు ఎంసీఏకు చూపించినట్టుగా లెక్కలు చూపెట్టలేకపోతోన్నాం. ప్రేక్షకులంతా సినిమాలు చూడాలని అనుకున్నామంతే.

► నేను థియేటర్ కోసం సినిమాను దాచాల్సిన అవసరం లేదు. కంటిన్యూగా సినిమాలు చేయాలి. ఏ రోజైతే థియేటర్లు స్టార్ట్ అవుతాయో ఆ రోజు ఇలాంటి ఓ సినిమాను రెడీగా పెడతాను అని నాకు తెలుసు. ఓటీటీలో రిలీజ్ చేస్తే ఏమైనా అవుతుందా? అనే భయాలేవి నాకు లేవు. జెర్సీ తరువాత నాకు ఎంతో సంతృప్తినిచ్చింది శ్యామ్ సింగ రాయ్. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో.. ఇప్పుడు అలాంటి ఫీలింగ్ ఉంది.

► సిరివెన్నెల గారు మాకు పాట రాయడం ఎమోషనల్ కనెక్ట్ అయింది. ఇది చివరి పాట అవుతుందేమో అని సిరివెన్నెల గారు అన్నట్టుగా రాహుల్ నాతో చెప్పాడు. కానీ అలా అవుతుందని మేం అనుకోలేదు. ఆ పాటలోనే సినిమా మొత్తం చెప్పేశారు. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అలాంటి రచయిత ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇలాంటి ఓ పాట రాయాలంటే ఇప్పుడు ఎవరున్నారు. ఎవరు లేరు. ఎండ్ ఆఫ్ ది ఎరా. అలాంటి పాట ఆయన శ్యామ్ సింగ రాయ్‌కు రాయడం అనేది వరం. ఆయన్ను సెలెబ్రేట్ చేసుకునే బాధ్యత మా మీద పెట్టినట్టు అయింది. ఇది మాకు ఎమోషనల్ ఎలిమెంట్ అయింది. ఆయనకు నివాళిగా ఈ సినిమా మొదలవుతుంది. ఆయన రాసేందుకు సరిపడా సినిమాను ఇచ్చామన్న సంతృప్తి మాకు వచ్చింది.

► దసరా సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలంగాణ యాసను తెలంగాణ వారి కంటే స్పష్టంగా పలుకుతాను. ప్రస్తుతం నా చేతిలో అంటే సుందరానికీ, దసరా సినిమాలున్నాయి. బాలకృష్ణ గారి గురించి బయట ఎన్నెన్నో వింటాం. కానీ అవేవీ నిజం కావు. ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం. అందరితోనూ ఒకేలా ఉంటారు.

► నా తదుపరి చిత్రాలు దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తాం. హిందీకి సరిపడా కథ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. జెర్సీ సినిమా పాన్ ఇండియాగా చేయాల్సింది. కానీ అప్పుడు ఆ ఆలోచన రాలేదు. నేను చేయలేదు కాబట్టి షాహిద్ కపూర్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వాళ్లకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా? (నవ్వులు)

► ఈగ సినిమాతో సౌత్ అంతా కూడా బాగా పాపులర్ అయ్యాను. నాని అంటే మా హీరో అన్నంతగా మారిపోయాను. చెన్నై, బెంగళూరు వంటి చోట్లకు వెళ్తే జనాలు ఎంతో ప్రేమను చూపిస్తుంటారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top