
నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు పెద్దఎత్తున నివాళులర్పించారు. 2018లో నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తారక్‌పై చేసిన కామెంట్లతో అభిమానులు భగ్గుమన్నారు. సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ఆ తర్వాత క్షమాపణలు చెప్తారని అందరూ భావించారు. అదీ లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ది చెప్తామని తారక్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి ఆయన సోదరి నందమూరి సుహాసిని క్లారిటీ ఇచ్చారు.
హరికృష్ణకు సుహాసిని నివాళులర్పించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని మీడియా ప్రశ్నించగా ఆమె ఇలా చెప్పారు. ' ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడు.' అని ఆమె క్లారిటీ ఇచ్చారు. నందమూరి హరికృష్ణ వారసుడిగా రాజకీయ ఎంట్రీ ఉంటుందా అనే ప్రశ్నకు ఆమె ఈ సమాధానం చెప్పడం విశేషం. దీంతో తారక్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలను నెట్టింట షేర్ చేస్తున్నారు.