
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. ఈ మూవీ గతేడాది సెప్టెంబర్ 27న రిలీజై సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. సముద్రం బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఈ విజయంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో.. అంతే రేంజ్లో ఆ సాంగ్ కూడా ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఎక్కడా చూసిన ఆ పాటే వినిపించేది. రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ను సొంతం చేసుకుంది.
'చుట్టమల్లే చుట్టేస్తావే' అంటూ వచ్చిన దేవర సాంగ్కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ రొమాంటిక్ సాంగ్ జూనియర్ ఫ్యాన్స్ను ఓ ఊపు ఊపేసింది. ఇందులో తారక్, జాన్వీ కపూర్‌ల కెమిస్ట్రీ అభిమానులను తెగ ఆకట్టుకుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు. శిల్పరావు గాత్రం ఈ రొమాంటిక్ మెలోడీని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.
తాజాగా ఇలాంటి పాటలకు వచ్చే క్రెడిట్ తమకు ఇవ్వడం లేదని దేవర సాంగ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాట విడుదలైన తర్వాత కొరియోగ్రాఫర్ల పేర్లను పూర్తిగా విస్మరించడం సరికాదంటున్నారు. సాంగ్ పూర్తయ్యాక కొరియోగ్రాఫర్లను మరిచిపోవడం సాధారణంగా మారిపోయిందన్నారు. ఇక్కడ నాకు క్రెడిట్ ఇవ్వలేదని కాదు.. నేను కాకుండా మరో బ్రాండ్ ఉన్న కొరియోగ్రాఫర్ అయితే కచ్చితంగా వారి పేర్లు వేసేవాళ్లన్నారు. పాటలకు పనిచేసిన కొరియోగ్రాఫర్ల బ్రాండ్ను దెబ్బ తీయవద్దని మేకర్స్ను కోరారు.
బోస్కో మాట్లాడుతూ.. 'పాట విడుదలైన తర్వాత కొరియోగ్రాఫర్‌ను మరచిపోతారు. మా కష్టాన్ని ఇతరులకు క్రెడిట్ ఇస్తారు. కానీ ఇప్పుడు కూడా పాట విడుదలైనప్పుడు కొన్నిసార్లు కొరియోగ్రాఫర్ పేర్లను కూడా చూస్తున్నాం. కానీ కొందరు మాత్రం కొరియోగ్రాఫర్ పేరును ఎప్పుడూ ఉంచరు. వారు ఎల్లప్పుడూ ఆ మూవీ స్టార్ పేరునే ఉంచుతారు. ఒక స్టార్‌కు ఎంత గొప్పగా పేరు వస్తే.. కొరియోగ్రాఫర్‌కు కూడా అంతే గొప్పగా రావాలని కోరుకుంటున్నా. సంగీత దర్శకుడికి ఎంత పేరు వస్తుందో.. సింగర్కు కూడా అంతే క్రెడిట్ దక్కాలి. నాకు రాకపోయినా.. నా తర్వాత వచ్చే కొత్తతరానికి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. దేవర సినిమా ఈ మూవీ రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు.