'బిగ్‌బాస్‌' షోలో భాగమైనందుకు సంతోషంగా ఉంది: నాగార్జున

Nagarjuna Delighted To Host Bigg Boss Season Five - Sakshi

వినోద ప్రియులు మరీ ముఖ్యంగా రియాల్టీ షో ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న, స్టార్‌ మా యొక్క ప్రతిష్టాత్మక రియాల్టీ షో బిగ్‌బాస్‌ మరో మారు తెలుగు ప్రేక్షకులకు ఆనందాశ్చర్యాలను కలిగించడానికి సిద్ధమైంది. బిగ్‌ బాస్‌ ఐదవ సీజన్‌ గ్రాండ్‌ ప్రీమియర్‌ 'స్టార్‌ మా' ఛానెల్‌లో సెప్టెంబర్‌ 05, సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. గత సీజన్‌ గ్రాండ్‌ ఫైనల్‌.. భారతదేశంలో మరే రియాల్టీ షో కూడా సాధించలేనట్టి రీతిలో అత్యధిక వీక్షణ రేటింగ్‌ను సాధించి రికార్డులను సృష్టించింది. ఆ రికార్డులను తిరగరాసే రీతిలో ఈ సారి బిగ్‌బాస్‌ షో ఉండనుంది. 

బిగ్‌బాస్‌ తెలుగుకు సంబంధించి ఓ సీజన్‌ ముగింపు రాత్రే తరువాత సీజన్‌కు సంబంధించిన  చర్చ కూడా ఆరంభమవుతుంటుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 5  ప్రచారాన్ని  రూపొందించారు. ఈ షో తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందోనంటూ ఎదురుచూసున్న అభిమానుల జీవితాల్లో పూర్తి వినోదాన్ని తీసుకువస్తామంటూ ఈ ప్రచారం జరిగింది. ''స్టార్‌ మా ఇప్పుడు అత్యున్నత శిఖరాలను చేరుకుంది. మా వీక్షకులు  మా పట్ల చూపుతున్న ప్రేమ, ఆదరాభిమానాలే దీనికి కారణం. అగ్రశ్రేణి ఛానెల్స్‌ సరసన మేము నిలిచాం. తద్వారా దేశంలో ప్రాంతీయ ఛానెల్‌ శక్తిని ప్రదర్శించాం. బిగ్‌బాస్‌ తెలుగు మరో సీజన్‌ను తీసుకురావడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. నేడు మా దగ్గర ఉన్న ఉత్సాహపూరితమైన షోలలో బిగ్‌ బాస్‌ ఒకటి. వీక్షకులకు 100 రోజులకు పైగా వినోదాన్ని ఇది అందిస్తుంది. తెలుగు వీక్షకుల నడుమ ఇది అపూర్వ ఆదరణను సొంతం చేసుకుంది..’’ అని స్టార్‌ మా అధికార ప్రతినిధి అన్నారు.

అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో పాటుగా డ్రామా, రొమాన్స్‌, యాక్షన్‌, వినోదంను నూతన టాస్క్‌లు, ఆసక్తికరమైన పోటీదారులతో మొత్తం కుటుంబానికి సమగ్రమైన వినోదం అందించనున్నారు. బిగ్‌బాస్‌ ఐదవ సీజన్‌కు హోస్ట్‌ చేయడం గురించి నాగార్జున మాట్లాడుతూ ‘‘గత కొద్ది నెలలు ప్రతి ఒక్కరికీ సవాల్‌గా నిలిచాయి. ఈ షోతో మా అభిమానుల జీవితాలలో  ఆనందం, ఉల్లాసం తిరిగి తీసుకురావాలనేది మా ప్రయత్నం. ఓ నటునిగా, పోటీదారుల వాస్తవ భావాలను వెలుపలికి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తద్వారా వారిని మరింతగా ప్రేక్షకులు అర్థం చేసుకోగలరు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించే ఈ షోలో భాగం కావడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు.

అంతర్జాతీయంగా అత్యంత విజయవంతమైన  నాన్‌ ఫిక్షన్‌ ఫార్మాట్‌లలో బిగ్‌ బాస్‌ ఒకటి. భారతదేశంలో ఏడు భాషలలో 37 సీజన్‌లను పూర్తి చేసుకున్న ఈ షో ఎండెమోల్‌షైన్‌ గ్రూప్‌ సొంతం.బిగ్‌బాస్‌ తెలుగు–సీజన్‌ 5, స్టార్‌మాలో సెప్టెంబర్‌05, సాయంత్రం 6 గంటలకు  తొలిసారి ప్రసారం అవుతుంది. అనంతరం 15 వారాల పాటు రాత్రి 10 గంటలకు సోమవారం–శుక్రవారం వరకూ మరియు రాత్రి 9 గంటలకు  శని–ఆదివారాలలో ప్రసారమవుతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top