#Chaysamdivorce: గుండె పగిలింది.. నాలుగేళ్లకే ఎందుకు ఇలా!

Naga Chaitanya Samantha Confirm Divorce Heartbroken Fans Upset - Sakshi

‘పై లోకంలో వాడు ఎపుడో ముడివేశాడు..’ అంటూ పాడుకుందో చూడచక్కని ప్రేమ జంట. ఆ తర్వాత రెండు(ఆటోనగర్‌ సూర్య, మనం) సినిమాల్లో కలిసి నటించి కనువిందు చేసింది. దీంతో స్క్రీన్‌పై ఇంత క్యూట్‌గా ఉన్న ఈ జంట... నిజ జీవితంలో జోడీ కడితే ఎంత బాగుంటుందో అని ఆశపడని అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. అవును.. మీ ఆశ త్వరలోనే నెరవేరుతుందంటూ ఎన్నోసార్లు హింట్‌ ఇచ్చింది ఆ హిట్‌ పెయిర్‌. ఒకే రకమైన పచ్చబొట్లు వేసుకుని తమ బంధాన్ని పదిలం చేసుకోబోతున్నామనే సంకేతాలు ఇచ్చింది.

హింట్‌ అయితే ఇచ్చింది కానీ మూవీ ఇండస్ట్రీలో ఇలాంటివి కామనే కదా.. ‘బంధం’ ఎంత కాలం నిలుస్తుందిలే అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ... బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయిన తాము.. రియల్‌ లైఫ్‌ కపుల్‌గా మారి జీవితాన్ని పంచుకోబోతున్నామంటూ శుభవార్త చెప్పింది. అక్టోబరు 7, 2017లో వివాహ బంధంతో ఒక్కటైంది. మనసులు కలిస్తే చాలు.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే కలిసి జీవించాలనే కోరిక బలంగా ఉంటే చాలు నిరూపించారు ‘చైసామ్‌’.

వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని బాలెన్స్‌ చేస్తూ..
ఆలుమగలంటే ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవడం కాదు అర్థం చేసుకుని జీవితాన్ని కొనసాగించడమే. ఈ విషయాన్ని అక్షరాలా నిజం చేశారని చైతూ- సమంత అభిమానులు సంబరపడిపోయారు. ఎందుకంటే.. సాధారణంగా... హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి పెళ్లైన తర్వాత తెరకు దూరమైన స్టార్లు ఎంతో మంది ఉన్నారు. అయితే పెళ్లికి ముందు నుంచీ చెప్పినట్లే సమంత.. ఆ తర్వాత కెరీర్‌ని దిగ్విజయంగా కొనసాగించారు. కొనసాగిస్తున్నారు కూడా.

అంతేకాదు నటిగానూ ఇంకా మెరుగయ్యారనే ప్రశంసలు అందుకున్నారు. చైతో వివాహం తర్వాత ఆమె నటించిన... రంగస్థలం, అభిమన్యుడు, మహానటి, యూటర్న్‌, ఓ బేబి సినిమాల విజయాలే ఇందుకు నిదర్శనం. ఇక భర్త చైతన్యతో కలిసి సామ్‌ నటించిన మజిలీ చిత్రంలో శ్రావణి పాత్ర ఆమెకు ఎంతటి పేరు తీసుకువచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజ జీవితంలో భర్తపై ఉన్న ప్రేమనంతా స్క్రీన్‌పై చూపించారంటూ అభిమానులు మురిసిపోయారు.

నిజానికి పెళ్లి తర్వాత ఓ హీరోయిన్‌ ఇంతలా రాణించడం అంటే గొప్ప విషయం అని...  ‘చై’ ఇచ్చిన ప్రోత్సాహం కూడా ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదని ఆ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎంత బిజీగా ఉన్నా భర్త కోసం టైమ్‌ కేటాయిస్తారు సామ్‌. వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరూ కలిసి హాలిడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తూ ఇటు పర్సనల్‌ లైఫ్‌ను, అటు ప్రొఫెషనల్‌ లైఫ్‌నూ బ్యాలెన్స్‌ చేస్తారనే పేరొందారు.

కానీ, ఆఖరికి ఇలా...
అలాంటి అందమైన జంట.. విడిపోతుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. సమంత.. తన సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి అక్కినేని అనే ఇంటి పేరును తొలగించడం, భర్తతో కలిసి ఈవెంట్లలో కనిపించకపోవడం ఇందుకు బలమిచ్చింది. అంతేగాక.. సూపర్‌ డీలక్స్‌, ఫ్యామిలీమేన్‌-2 వంటి సిరీస్‌లలో సామ్‌ బోల్డ్‌గా కనిపించడమే ఇందుకు కారణమంటూ పుకార్లు షికారు చేశాయి.

అయితే, ‘‘అదంతా అబద్ధం... త్వరలోనే ఈ వదంతులకు చెక్‌ పడుతుంది. మా చైసామ్‌ పెళ్లి రోజున గుడ్‌న్యూస్‌ వినిపిస్తారు’’అని ఈ జంట అభిమానులు ఆశించారు. కానీ, వారి ఆశలను అడియాసలు చేస్తూ.. వెడ్డింగ్‌ డేకు సరిగ్గా నాలుగు రోజుల ముందు అంటే నేడు(అక్టోబరు 2) చేదు వార్తను వినిపించారు ‘చై- సామ్‌’. నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు విడివిడిగా ప్రకటన చేశారు.

ఈ క్రమంలో.. ‘‘మా గుండె పగిలింది. చూడచక్కని జంట. మీ నిర్ణయం మాకు నచ్చలేదు. కానీ మీరివురూ బాగుండాలి’’ అని అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, హేటర్స్‌ మాత్రం ఎప్పటిలాగే విపరీతపు కామెంట్లతో ఈ ‘జోడీ’ని విమర్శిస్తున్నారు.

చై-సామ్‌ పెళ్లినాటి  ఫోటోలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top