
హీరో ‘అల్లరి’ నరేశ్ నటిస్తున్న 65వ సినిమా షురూ అయింది. చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ‘నరేశ్ 65’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్, నరేశ్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నాగచైతన్య క్లాప్ కొట్టారు.
దర్శకుడు వీఐ ఆనంద్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకులు వశిష్ఠ, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు.
‘‘యునిక్ కాన్సెప్ట్స్‌తో ఆకట్టుకున్న కామెడీ కింగ్ నరేశ్ తన కొత్త చిత్రం ‘నరేశ్ 65’తో తిరిగి కామెడీ జానర్‌లోకి వచ్చారు. ఈ సినిమాలో ఆయన సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఫ్యాంటసీ, కామెడీ బ్లెండ్‌తో సరికొత్తగా ఉంటుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: రాంరెడ్డి.