నిర్మాత సుధాకర్‌ కన్నుమూత

Movie producer Mannam Sudhakar no more - Sakshi

నిర్మాత, కెమెరామేన్‌ మన్నం సుధాకర్‌ (62) అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. మూడు నెలల క్రితం చెన్నైలోని స్వగృహంలో బాత్‌రూంలో ప్రమాదవశాత్తు పడటంతో తలలో తీవ్ర రక్తస్రావమైంది. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన ఆ తర్వాత ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూశారు.

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి ఆయన స్వస్థలం. ప్రముఖ కెమెరామేన్‌ వీయస్‌ఆర్‌ స్వామి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన సుధాకర్‌ ‘సితార, వారాలబ్బాయి, పుట్టినిల్లా మెట్టినిల్లా’ వంటి పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. మహాగణపతి ఫిలింస్‌ బ్యానర్‌ స్థాపించి ‘తారకరాముడు, నా మనసిస్తారా, వాలి, సేవకుడు, ఆక్రోశం’ వంటి సినిమాలు నిర్మించారు సుధాకర్‌.

టంగుటూరు ప్రాంతం నుంచి పలువురిని సినీ రంగానికి పరిచయం చేశారాయన. సుధాకర్‌కి భార్య దేవరపల్లి లక్ష్మమ్మ, కుమారులు మన్నం హరీష్‌ బాబు, మన్నం సతీష్‌ బాబు ఉన్నారు. కాగా ఆయన కుమార్తె మన్నం స్వాతి గతంలోనే చనిపోయారు. కారుమంచిలో మన్నం సుధాకర్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top