ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపై మోంథా తుపాన్ గట్టిగానే ప్రభావం చూపిస్తోంది. తెలంగాణలో అక్కడక్కడ ఓ మాదిరిగా వర్షాలు పడుతున్నాయి కానీ ఆంధ్రాలో మాత్రం ఎక్కడచూసినా సరే వానలు దంచికొడుతున్నాయి. తీరమంతా అల్లకల్లోలంగా ఉంది. ప్రభుత్వం కూడా ప్రజలు ఎవరినీ బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది. అయితే మోంథా తుపాన్ ప్రభావం.. టాలీవుడ్‌పై ఎలా ఉండనుంది?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
మోంథా తుపాన్.. ఈ రోజు(అక్టోబరు 28) రాత్రికి కాకినాడ దగ్గర తీరదాటనుంది. దీంతో బుధవారం కూడా కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్ష ప్రభావం గట్టిగానే ఉండగా.. కొన్ని ప్రాంతాలు నీటమునిగే అవకాశం కూడా లేకపోలేదు. శుక్రవారానికి గానీ తుపాన్ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే ఈ శుక్రవారం 'బాహుబలి' రీ రిలీజ్‌తో పాటు 'మాస్ జాతర' సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిపై ఇప్పటికైతే ఓ మాదిరి బజ్ మాత్రమే ఉంది. ఇప్పుడు తుపాన్ ప్రభావం వల్ల జనాలు ఈ వీకెండ్.. మూవీస్ చూసేందుకు ఆంధ్రాలో థియేటర్లకు వస్తారా అంటే సందేహమే. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం రవితేజ, ప్రభాస్ చిత్రాలకు కలెక్షన్స్ పెద్దగా రాకపోవచ్చనే మాట వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: 'సౌందర్య'ను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ (వీడియో))
'బాహుబలి' రీ రిలీజ్ విషయానికొస్తే.. గతంలో విడుదలైన రెండు భాగాల్ని కలిపి ఇప్పుడు 'ఎపిక్' పేరుతో ఒకే పార్ట్‌గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాడు. 3 గంటల 44 నిమిషాల నిడివితో ఇది ఉండనుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు. అయితే కొత్తగా ఓ సీన్ కూడా జోడిస్తున్నామని సినిమాటోగ్రాఫర్ సెంథిల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
'మాస్ జాతర' విషయానికొస్తే.. రవితేజ చేసిన రెగ్యులర్ కమర్షియల్ మూవీ. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆయన గత చిత్రాల మాదిరిగా రొటీన్‌లానే అనిపించింది. ట్రైలర్ ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ.. మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి? రవితేజకు ఇది 75వ మూవీ కావడం విశేషం. సితార ఎంటర్‍టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించగా.. భాను భోగవరపు దర్శకత్వం వహించాడు.శ్రీలీల హీరోయిన్.


