
మద్యపానం, లేదా ఇంకేదైనా చెడు అలవాట్లపై వాటి ప్రచారాలపై ఇదేందయ్యా మీరు ప్రముఖులు కదా ఇలా చేయవచ్చా? అని ప్రస్తుతం సెలబ్రిటీలు ఎవరిని ప్రశ్నించినా, వ్యక్తిగతం వేరే, వృత్తిగతం వేరే వ్యాపకాలు వేరే వ్యాపారం వేరే అంటూ దేనికి దాన్ని విడదీసి చూడాలంటూ చిలకపలుకులు వల్లిస్తున్నారు. మద్యం తదితర హానికారక పదార్ధాల ప్రకటనల్లో నటించడం దగ్గర నుంచి పబ్స్, క్లబ్స్ వంటి వ్యాపారాల్లో సెలబ్రిటీలు లేదా వారి సంబంధీకుల పేర్లతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాలుపంచుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్‌లో ఓ టాప్ హీరో భార్య తనకు ఇష్టం లేని పనులు చేయబోనని అంతేకాక మరొకరి చేత చేయించబోనని ఖండితంగా చెప్పడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ‘‘కొన్ని వ్యాపారాలు నా నమ్మకాలకు విరుద్ధం’’ అంటున్న ఆమె ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్య మిరా రాజ్‌పుత్(Mira Rajput ) ఫోర్బ్స్ ఇండియా నిర్వహించిన ఓ ప్యానల్ చర్చలో మాట్లాడుతూ, ‘‘నేను సంపూర్ణ శాకాహారిని, కనీసం గుడ్లు కూడా తినను. అలాగే ఇంతవరకూ చేయలేదు భవిష్యత్తులో కూడా మద్యపానం చేయను. అలాంటప్పుడు మాంసాహారం మద్యం అందించే వ్యాపారంలో పెట్టుబడి ఎలా పెడతాను? అది నా నమ్మకాలకు పూర్తి విరుద్ధం కదా’’ అని చెప్పింది.
ఇటీవల ఓ ప్రముఖ బ్రాండ్ నుంచి రెస్టారెంట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని వచ్చిన అవకాశాన్ని ఆమె తిరస్కరించారు. దీనికి కారణాలను గురించి ఆమె మాట్లాడుతూ ఆ కారణాలు తన జీవనశైలితో మాత్రమే కాదని వ్యక్తిగత నైతిక విలువలతో ముడిపడి ఉన్నవని అంటోంది.
‘‘నిజమే వ్యాపారంలో లాభం ముఖ్యం అయినా, అది వ్యక్తిగత విలువలకు భంగం కలిగించకూడదు. నాపై నమ్మకం ఉంచినవారికి, నా కుటుంబానికి సమాజంతో సత్సంబంధాలు ఉండాలంటే, నేను నమ్మే విషయాలలో నాకు స్పష్టత ఉండాలి’’ అంటూ ఎంతో స్వఛ్చంగా స్పష్టంగా ఆమె చెప్పిన మాటలు సినీ వర్గాలను ఆకట్టుకున్నాయి.
ఒక పబ్లిక్ ఫిగర్‌గా తన నిర్ణయాలు సమాజంపై ప్రభావం చూపుతాయన్న అంటూ అంగీకరించిన మీరా. ‘‘బయట ఎంతో మంది ఎన్నో మంచి మాటలు ఎప్పుడూ చెబుతుంటారు, కానీ మన స్వంతమైన చైతన్యం మనకు మార్గం చూపాలి. మనం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, అది మన అంతరాత్మ అంగీకరించేలా దానికి నచ్చేలా ఉండాలి’’ అని స్పష్టం చేశారు. మిరా రాజ్‌పుత్ ప్రస్తుతం హోలిస్టిక్ హెల్త్, నేచురల్ లివింగ్, స్కిన్ కేర్ రంగాల్లో వ్యాపారాల్ని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు ఆమె సోషల్ మీడియా ద్వారా కూడా ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రోత్సహిస్తున్నారు.
ప్రస్తుతం సినీరంగానికి అవతల.. రెస్టారెంట్ లతో సహా అనేకానేక వ్యాపారాల్లో సెలబ్రిటీలు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటిదాకా ఏ పెద్ద సెలబ్రిటీ కి సాధ్యం కాని విధంగా మీరా రాజ్‌పుత్ వ్యక్తం చేసిన నైతిక విలువలు... అభినందనీయం మాత్రమే కాదు...రూ.వందల కోట్లు ఉన్నా ఇంకా డబ్బు పిచ్చితో సమాజాన్ని భ్రష్టు పట్టించే వ్యాపారాలకు వెన్ను దన్నుగా నిలుస్తున్న సెలబ్రిటీలకు. ఇకనైనా అనుసరణీయం కూడా.