 
													విలక్షణ నటుడు మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) యాంకర్‌గా, నటిగా రాణిస్తోంది. ఇటీవలే దక్ష సినిమాతో పలకరించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలపై ఓపెన్ అయింది. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ఇంటర్ చదివేవరకు కూడా అమ్మ సెలక్ట్ చేసిన బట్టలే వేసుకునేదాన్ని. తను ఎలా చెప్తే అలా నడుచుకునేదాన్ని. నా తలకు నూనె పెట్టి జడేసేది. అలాగే కాలేజీకి వెళ్లేదాన్ని. నాన్న అయితే చాలా స్ట్రిక్ట్.
సడన్ సర్‌ప్రైజ్
పెళ్లి తర్వాత అమెరికాలోనే సెటిలైన నేను కూతురు పుట్టే సమయానికి ఇండియాకు వచ్చాను. నా భర్త కూడా వచ్చాడు. కానీ, ఇక్కడ అడ్జస్ట్ అవలేకపోయాడు. అందుకే 2019లో అమెరికాకు తిరిగి వెళ్లిపోయాడు. మీకు నచ్చినప్పుడు వస్తూ ఉండండి అని చెప్పాడు. దగ్గరుండి గొడవలుపడేకన్నా.. దూరంగా ఉండటమే మంచిదని నేనూ ఒప్పుకున్నాను. అయితే తనకెంత కోపమొచ్చినా సరే.. కూతురి ముందు ఒక్క మాట కూడా అనడు. నా తమ్ముడు మనోజ్ (Manchu Manoj) కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టపడ్డాడు. నేను మీకు తెలుసా? మూవీ కోసం అమెరికాలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అప్పుడు సడన్‌గా సర్‌ప్రైజ్ అని మా ఇంటికొచ్చి కొన్నివారాలుండేవాడు. 

క్యాండిల్స్ కోసం లక్షలు
అప్పట్లో మేము సింగిల్ బెడ్‌రూమ్‌లో ఉండేవాళ్లం. ఆ సమయంలో నేలపై పడుకునేవాడు. కానీ, ఇప్పుడేమో ఎక్కువ లగ్జరీ కోరుకుంటున్నాడు. క్యాండిల్ కోసం లక్షలు ఖర్చుపెడుతున్నాడు. నేను హోస్ట్ చేసిన మేము సైతం షో విషయానికి వస్తే.. ఆ షో నన్నెంతగానో మార్చేసింది. దీని తర్వాత కూడా మంచిపనులు ఆపలేదు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టించాం. దివ్యాంగులకు ఆరంతస్తుల భవంతి కట్టించాం. గుంటూరులో ఒకావిడకు ఇల్లు కట్టించాం. ఇప్పటికీ రకుల్ ఓ అమ్మాయికి చదువు చెప్పిస్తోంది. సందీప్‌కిషన్ ఓ కుటుంబానికి అండగా ఉన్నాడు. ఇలా చాలా ఉన్నాయి. కానీ, అవి బయటకు చూపించమంతే!
ఇంట్లో పెద్ద గొడవ
ముంబై షిఫ్ట్ అవడానికి ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు. ఎందుకో ముంబై వెళ్లాలని మనసుకు అనిపించింది, వెళ్లిపోయానంతే! పైగా అక్కడ నా కూతుర్ని సెలబ్రిటీలా ఎవరూ చూడరు, స్వేచ్ఛగా బతుకుతుంది. నా కూతుర్ని అడవిలో వదిలేస్తే ఆకులు తినైనా బతకాలి అనేలా పెంచాను. ఎందుకంటే ఈ లగ్జరీ జీవితం ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు. అందుకే తనను సింపుల్‌గా పెంచాను. మొదట్లో తను విష్ణు స్కూల్‌కే వెళ్లేది. ఆరు నెలలు వెళ్లాక సడన్‌గా స్కూల్ మాన్పించేశాను. అప్పుడు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది.

నా కూతురి భవిష్యత్తు ముఖ్యం
నేను స్కూల్‌లో ఒక్క రూపాయి ఫీజు కట్టలేదు. పైగా అందరూ తనపై ఎక్కువ కేరింగ్ చూపించారు. కారు డోర్ తీయడం, లిఫ్ట్ నొక్కడం.. ఇలా తనను అడుగు కిందపెట్టనీయలేదు. ఇలాంటి లగ్జరీ వద్దనే ఆ స్కూల్ మాన్పించాను. గచ్చిబౌలిలోని ఓ చిన్న స్కూల్‌కు పంపించాను. ఇంట్లో వాళ్లు బాధపడ్డప్పటికీ నా నిర్ణయం మార్చుకోలేదు. వాళ్ల కోసం నా కూతురి భవిష్యత్తును పాడు చేయలేను. ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు చూసిందే నిజమనుకుంటారు, అదే నేర్చుకుంటారు.
శాపనార్థాలు
మనోజ్ 'మిరాయ్' సినిమా ఈవెంట్‌లో ఏది మాట్లాడినా దాన్ని కట్ చేసి తప్పుగా ప్రచారం చేశారు. విష్ణు గురించి ఒక్క ముక్క తప్పుగా మాట్లాడకపోయినా సరే విష్ణును తిడుతున్నట్లుగా తప్పుడు థంబ్‌నైల్స్ పెట్టారు. అసలు ఒక కుటంబాన్ని కలపాలనుకుంటున్నారా? విడదీయాలనుకుంటున్నారా? వాళ్ల మధ్య ఇంకా అగ్గిరాజేసి విడదీయాలని చూసిన అందరూ సర్వనాశనం అయిపోతారు. ఈ జీవితంలోనే మీ కర్మ అనుభవిస్తారు అని మంచు లక్ష్మి శాపనార్థాలు పెట్టింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
