
తల్లి కోసం భర్తను, పిల్లల్ని వదిలేసింది మలయాళ నటి లవ్లీ బాబు (Lovely Babu). మంచానపడ్డ తల్లిని తీసుకుని కేరళ కొల్లంలోని గాంధీ భవన్ ఆశ్రమంలో జీవిస్తోంది. కేవలం ఆమెను చూసుకోవడానికే సినిమాలకు సైతం విరామం ఇచ్చినట్లు చెప్పింది. అయితే ఆమె తన తల్లి చేతులు కట్టేసి ఆమెపై దాడి చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
డబ్బుకే విలువ
దీంతో కొందరు నటిని తప్పుపడుతుండగా మరికొందరు ఆమెను వెనకేసుకొస్తున్నారు. సేవలు చేసినప్పుడు కొన్నిసార్లు అసహనం, కోపం రావడం సహజం.. అందులో లవ్లీ తప్పేమీ లేదని కామెంట్లు చేస్తున్నారు. తాజాగా లవ్లీ మాట్లాడుతూ.. గతంలో నాకు క్యాన్సర్ ఉండేది. అప్పుడు క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ఖర్చు, నా పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు.. ఇలా నాపై చాలా భారం ఉండేది. నా భర్త ఎప్పుడూ డబ్బు ముఖ్యం అని నమ్మేవాడు. తను బంధాలకు విలువ ఇవ్వడు.
దీనస్థితిలో అమ్మ
ఒకసారి నేను ఊరెళ్లి పది రోజుల తర్వాత వచ్చాను. అప్పుడు అమ్మ పరిస్థితి చూసి షాకయ్యాను. వాంతులు చేసుకున్న ప్లేస్‌లోనే పది రోజులుగా పడుకుని ఉంది. మరోసారేమో తన డైపర్ ఎవరూ మార్చకపోవడంతో గదంతా కంపు కొడుతోంది. అమ్మ పరిస్థితి అధ్వాణ్నంగా తయారైనప్పుడు నాకు కోపం వచ్చేది. నాకు చచ్చిపోవాలనిపించేది. కానీ నేను పోతే అమ్మను ఎవరు చూసుకుంటారనిపించేది. పట్టలేనంత కోపం వచ్చినప్పుడు అమ్మను కొట్టేదాన్ని. అది కావాలని చేసింది కాదు.. తర్వాత మళ్లీ నేనే బాధపడేదాన్ని.
ఏ రైలు కిందో పడేవాళ్లం
అమ్మను వదిలించుకోమని ఇంట్లోవాళ్లన్నారు. కానీ తనను అనాథగా వదిలేందుకు మనసొప్పలేదు. బయటకు వెళ్లి బతికేంత ఆర్థిక స్థోమత లేదు. అందుకే భర్తను, పిల్లల్న వదిలి ఆశ్రమానికి వచ్చేశాను. గాంధీ భవన్ మాకు ఆశ్రయం కల్పించుండకపోతే మేము ఏ రైలు కిందో పడేవాళ్లం, లేదంటే ఏ చెరువులోనో దూకి చనిపోయేవాళ్లం అని లవ్లీ బాబు భావోద్వేగానికి లోనైంది.
చదవండి: పోలీస్ స్టేషన్‌లో దెయ్యాలు.. ఆర్జీవీ కొత్త సినిమా పోస్టర్