
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కొన్నాళ్ల క్రితం మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ మహావిష్ణువు దశావతారాలపై ఏడాదికో యానిమేటెడ్ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగా తొలి సినిమా 'మహావతార్: నరసింహ' నేడు(జులై 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ యూనిమేటెడ్ ఫిల్మ్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
'మహావతార్: నరసింహ' కథేంటంటే..
పురాణాల్లో ఉన్న భక్త ప్రహ్లాద, నరసింహ స్వామి కథ గురించి తెలిసిందే. విష్ణువు మూర్తి నరసింహ అవతారం(సగం మనిషి, సగం సింహం) ఎత్తి, భక్తుడైన ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. ఇదే కథను యానిమేషన్లో చూస్తే.. అదే మహావతార్: నరసింహ సినిమా.
విశ్లేషణ
భక్త ప్రహ్లాద కథతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఎస్వీ రంగారావు, అంజలీదేవి, రోజా రమణి ప్రధాన పాత్రలు పోషించిన 'భక్త ప్రహ్లాద' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ప్రహ్లాద కథ దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి తెలిసింది. ఇలాంటి కథలు నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా'మహావతార్: నరసింహ'. కథనం మొత్తం యానిమేషన్తో నడుస్తుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు.
కశ్యప మహాముని భార్య కడుపున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పుట్టడానికి గల కారణాలను వివరిస్తూ ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. మహా విష్ణువుపై ద్వేషం పెంచుకున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు..తమకున్న శక్తులతో దేవతలను సైతం భయబ్రాంతులకు గురిచేస్తారు. ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడు భూదేవికి అపహరించి సముద్ర గర్భంలో బంధిస్తాడు. దీంతో విష్ణు మూర్తి వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడు సంహరించి భూదేవిని తీసుకొస్తాడు. సోదరుడి మరణంతో విష్ణుపై హిరణ్యకశిపుడు మరింత పగను పెంచుకుంటాడు. తీవ్రమైన తప్పస్సు చేసి బ్రహ్మాదేవుడి నుంచి తనకు భూమి, అకాశం పైన,దేవతలతో గాని, పశువులతోగానీ, పగలు గానీ రాత్రి గానీ మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ శక్తులతో ఇంద్రలోకాన్ని సైతం తన ఆధీనంలోకి తెచ్చకుంటాడు. అతని కొడుకే ప్రహ్లాదుడు. పుట్టుకతోనే విష్ణుమూర్తి భక్తుడిగా మారతాడు. తండ్రికేమో విష్ణువు అంటే పడదు.. కొడుకుకేమో విష్ణుమూర్తే సర్వస్వం అన్నట్లుగా బతుకుతాడు. ఎంత నచ్చజెప్పిన విష్ణుమూర్తి పేరు తలచకుండా ఉండడు. చివరకు కొడుకునే సంహరించాలని చూస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి నరసింహా అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు.
ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ కథలో ఉన్నాయి. దాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ చక్కగా వాడుకున్నాడు. భారీ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్‌తో అద్భుతంగా తీర్చిదిద్దాడు. క్లైమాక్స్లో నరసింహ స్వామి ఎంట్రీ ఇచ్చే సీన్ అదిరిపోతుంది.హిరణ్యకశిపుడితో నరసింహాస్వామి చేసే యాక్షన్ తెరపై చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. యానిమేటెడ్ సినిమా అయినా సరే కొన్ని యాక్షన్ సీన్లకు థియేటర్స్‌లో విజిల్స్ పడతాయి. యానిమేషన్ పర్ఫెక్ట్‌గా కుదిరింది. తెరపై చూస్తుంటే కమర్షియల్ సినిమా చూస్తున్నట్లే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ చక్కగా కుదిరింది. సామ్ సీ.ఎస్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. బీజీఎం అదిరిపోయింది. చిన్నపిల్లలు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.