
కొన్నిసార్లు చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. అలా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'మహావతార్ నరసింహా' అనే యానిమేటెడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా యానిమేటెడ్ చిత్రాలు మన దగ్గర పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. కానీ ఈ మూవీ మాత్రం మౌత్ టాక్తో పాటు కళ్లు చెదిరే కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే ఏకంగా రూ.10 కోట్లకు పైన వసూళ్లు రావడం విశేషం.
ఓవైపు 'హరిహర వీరమల్లు' లాంటి తెలుగు సినిమా పోటీ ఉన్నప్పటికీ.. 'మహావతార్ నరసింహా' స్క్రీన్ కౌంట్ పెంచుకుంటూ పోతోంది. తొలిరోజు కొన్ని థియేటర్లు దక్కగా.. రెండోరోజు, మూడో రోజుకి థియేటర్ల సంఖ్య పెరిగింది. అదే రీతిన వసూళ్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. తొలిరెండు రోజుల్లో కలిపి రూ.5 కోట్ల మేర కలెక్షన్స్ రాగా.. మూడో రోజైన ఆదివారం మాత్రం దేశవ్యాప్తంగా రూ.11.25 కోట్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)
ఈ లెక్కన చూసుకుంటే మూడు రోజుల్లో కలిపి దాదాపు రూ.20 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని తెలుస్తోంది. కేజీఎఫ్, కాంతార, సలార్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేటెడ్ సినిమా 'మహావతార్ నరసింహా'. మనకు బాగా తెలిసిన విష్ణు అవతారాలు ఆధారంగా ఓ యూనివర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా రిలీజైన తొలి పార్ట్ ఇది. నరసింహా స్వామి అవతారం స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా అమితంగా నచ్చేస్తోంది.
సాధారణంగా మన దగ్గర యానిమేటెడ్ మూవీస్ పెద్దగా వర్కౌట్ కావు. గతంలో 'హనుమాన్' తదితర చిత్రాలు వచ్చాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సరే వసూళ్లు రాబట్టుకోలేకపోయాయి. ఈ సినిమా మాత్రం కోట్ల రూపాయలు కలెక్షన్స్, అది కూడా పాన్ ఇండియా లెవల్లో అంటే విశేషమనే చెప్పాలి.
(ఇదీ చదవండి: ఏంటమ్మా అన్నావ్, ఇంకోసారి అను.. అనసూయపై మళ్లీ ట్రోలింగ్!)
