
ఇటీవల తరచూ వార్తల్లో ఉంటున్న నటుడు రవిమోహన్ (జయం రవి). ఈయన భార్యతో వివాహ రద్దు కేసు కోర్టులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గాయని కనిష్కతో ప్రేమాయణం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిని నిజం చేసే విధంగా నటుడు రవిమోహన్ గాయనీ కనిష్కతో ఆలయాలకు, ఇతర కార్యక్రమాలకు కలిసి తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా ఈయన గాయని కనిష్కతో కలిసి సంగీత కచేరిలో భాగంగా శ్రీలంకకు వెళ్లారు. అక్కడ మంత్రులతో కలిసి తీయించుకున్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు.
ఇదిలా ఉంటే రవిమోహన్ తన సంస్థకు రెండు చిత్రాలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారని, అందుకు గానూ ఆయనకు రూ.6 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్లు, అయితే ఆయన తమ సంస్థకు చిత్రాలు చేయకుండా వేరే సంస్థలకు చేస్తున్నారని, అడ్వాన్స్ తిరిగి చెల్లించమని కోరినా , ఇవ్వడం లేదని బాబీ టచ్ గోల్ల్ యూనివర్సల్ సంస్థ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో నటుడు రవిమోహన్ కూడా తాను కేటాయించిన కాల్‌షీట్స్‌ను వాడుకోకుండా వృథా చేసినందుకు గానూ ఆ సంస్థే తనకు నష్ట పరిహారంగా రూ.9 కోట్లు చెల్లించాలని కోరుతూ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసుపై ఇటీవల విచారణ జరిగింది. కాగా తాజాగా న్యాయస్ధానంలో మరోసారి విచారణ జరిగింది. ఈ కేసు పరిష్కారం కోసం ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ, నటుడు రవిమోహన్ పిటిషన్‌ను కొట్టి వేసింది. అంతే కాకుండా నటుడు రవిమోహన్ రూ.5.9 కోట్లకు సంబంధించిన పత్రాలను 4 వారాలలోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.