
నటుడు విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం కింగ్డమ్. ఇటీవల విడుదలైన ఈ చిత్రంపై తమిళనాడులో కొన్ని రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. చిత్రాన్ని నిషేధించాలంటూ ఆందోళన కార్యక్రమాలను చేస్తున్నారు. దీంతో కింగ్డమ్ తమిళనాడు విడుదల హక్కులను పొందిన ఎస్‌ఎస్‌ఐ ప్రొడక్షన్స్ రంగంలోకి దిగింది. కింగ్డ్‌మ్ చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్లకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ న్యాయమూర్తి భరత చక్రవర్తి ముందుకు వచ్చింది.
పిటిషనర్ తరపు న్యాయవాది వివరణ ఇస్తూ కింగ్డమ్ చిత్రం కల్పిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం అని, ఇందులో సమాజంలోని ఏ వర్గాన్ని కించపరచే సన్నివేశాలు లేవని, ఏ వర్గాన్నీ ప్రతి కూలంగా చిత్రీకరించే ఉద్దేశం తమకు లేదని వాదించారు. నామ్ తమిళర్ పార్టీ తరపు న్యాయవాది కోర్టులో తమ వాదనలను వినిపిస్తూ చిత్రంలో శ్రీలంక తమిళులను వలస దారులు, అక్రమ రవాణాదారులంటూ తప్పుగా చిత్రీకరించడాన్ని నిరసిస్తూ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను మాత్రమే నిర్వహిస్తున్నామని, చిత్ర ప్రదర్శనలను నిషేధించాలని నామ్ తమిళర్ పార్టీ కోరడం లేదని పేర్కొన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం కింగ్డమ్ చిత్రం జూలై 31 నుంచి ప్రదర్శింపబడుతోందని, ఎక్కడా చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరిగినా కేసులు పెట్టి చర్యలు తీసుకుంటున్నామని, థియేటర్ల యాజమాన్యానికి ఎక్కడా బెదిరింపులు రావడం లేదని పేర్కొన్నారు. అలాంటివి జరిగితే పోలీసుల భద్రత కల్పిస్తామని న్యాయస్ధానానికి తెలియజేశారు. ఇరువర్గాల వాదలను విన్న న్యాయమూర్తి ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందన్నారు. సెన్సార్‌బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన చిత్రాలను ఎవరూ ఆపలేరన్నారు. మీకు సినిమా నచ్చకపోతే చూడడం మానేయాలన్నారు. అదేవిధంగా నామ్ తమిళర్ పార్టీకి చెందిన వారికి కూడా శాంతియుతంగా తమ నిరసనలను వ్యక్తం చేసే హక్కు కూడా ఉందన్నారు. అయితే దాన్ని కేటాయించిన ప్రాంతంలోనే నిర్వహించాలన్నారు. నిరసనలను ఆపే హక్కు ఎవరికీ లేదన్నారు. కింగ్డమ్ చిత్రానికి అంతరాయం కలిగిస్తే తగిన భద్రత కల్పించాలని పోలీసులకు న్యాయమూర్తి ఆదేశించారు.