లోకేశ్ కనగరాజ్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం డీసీ. తొలిరోజు నుంచి పాజిటివ్ టాక్ వస్తుండడంతో ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. విడుదలై 10 రోజులు పూర్తయినా ఈ సినిమా వసూళ్ల జోరులో ఏ మాత్రం తగ్గడంలేదు.
మొదటి వారంలో..
మొదటి వారంలో ఈ చిత్రం ఇండియాలో బాక్సాఫీస్ వద్ద రూ.41.9 కోట్ల నెట్ వసూళ్లను నమోదు చేసింది. రెండో వారంలో కూడా ఆదివారం ఒక్కరోజే రూ.4.5 కోట్లను ఖాతాలో వేసుకుంది. అయితే తొలి ఆదివారం వచ్చిన రూ.9.55 కోట్లతో పోలిస్తే ఇది 50 శాతానికి పైగా తగ్గింది. రెండో వారంలో మొత్తం రూ.12.86 కోట్లను వసూలు చేసిన 'డీసీ'.. మొత్తం నెట్ కలెక్షన్లు రూ.54.76 కోట్లకు చేరుకున్నాయి. గ్రాస్ వసూళ్లు సుమారు రూ.64.62 కోట్లుగా నమోదయ్యాయి.
ఈ వసూళ్లతో 'పరాశక్తి', 'యూత్', 'బ్లాస్ట్' చిత్రాలను అధిగమించిన 'డీసీ'.. 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాల్లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం రూ.62.46 కోట్లతో ఉన్న 'తాయ్ కిజవి' చిత్రానికి చేరువలో ఉంది. ఇదే జోరు కొనసాగితే రెండో వారం ముగిసే నాటికి ఆ చిత్రాన్ని కూడా అధిగమించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


