'పుష్ప-2'పై 'కేజీయఫ్‌-2' ఎఫెక్ట్‌ పడనుందా..?

KGF-2 Effect On Allu Arjun Pushpa-2 Movie - Sakshi

గత కొంతకాలంగా దక్షిణాది చిత్రాలు భారతీయ సినిమాకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. అక్కడి జనాలు మన చిత్రాల మేకింగ్‌, టేకింగ్‌, యాక్టింగ్‌లకు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ ప్రస్తుతం దక్షిణాది చిత్రాలదే హవా. తాజాగా రాకింగ్‌ స్టార్‌ యశ్‌ 'కేజీయఫ్‌-2'తో హిందీలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. దాంతో ఈ చిత్ర ప్రభావం రాబోయే సినిమాలపై పడనుందా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. 'కేజీయఫ్‌: చాప్టర్‌1'కు కొనసాగింపుగా 'కేజీయఫ్‌-2' వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఆ చిత్రం తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో కథతో పాటు హీరో ఎలివేషన్స్‌ ఓ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం సీక్వెల్స్‌ చేస్తున్న దర్శకులకు 'కేజీయఫ్‌-2' భారీ హీట్‌ కావడంతో ఇతర చిత్రాల మేకర్స్‌కు అది ఒకింత తలనొప్పిగా మారిందంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే తొలి భాగంతో పోలిస్తే రెండో భాగం ఏమాత్రం తగ్గినా దాన్ని ప్రేక్షకుడు జీర్ణించుకోలేకపోవచ్చు. మొదటి పార్ట్‌, రెండో పార్ట్‌ను పోల్చి చూడటంతో దానిపై రకరకాల చర్చలు జరిగే అవకాశం ఉంది. అది చిత్ర ఫలితంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కూడా ఉందంటున్నారు.

అయితే సీక్వెల్స్‌ విషయంలో 'కేజీయఫ్‌' చిత్రంలానే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ 'పుష్ప' రెండో భాగం కూడా పాన్‌ ఇండియా లెవల్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి రాఖీభాయ్‌ పాత్రలా పవర్‌ఫుల్‌ ఎలివేషన్స్‌తో 'పుష్ప' పాత్ర ఉంటుందా? అసలు పుష్ప ఎర్రచందనం సిండికేట్‌ను ఎలా నడిపించాడు? భన్వర్‌ సింగ్‌ షెకావత్‌తో పాటు మంగళం శ్రీనులను ఎలా ఎదుర్కొని నిలిచాడు? లాంటి పలు ప్రశ్నలు ప్రస్తుతం ప్రేక్షకులను తొలిచేస్తున్నాయి. దీంతో చిత్ర బృందం సైతం అభిమానుల అంచనాలను అందుకునేలా పలు సన్నివేశాలను రాసుకుంటోందని సమాచారం. అయితే దర్శకుడు సుకుమార్‌ మాత్రం తగ్గేదేలే అనేలా పుష్పరాజ్‌ పాత్రను మరింత ఎలివేట్‌ చేసేలా పుష్ప-2 కథ, కథనాలను మలుస్తున్నాడని తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top