
బుల్లితెరపై రోజూ రకరకాల షోలు ప్రసారం అవుతుంటాయి. ఒక చానల్‌లో కామెడీ షో..మరో చానల్‌లో డ్యాన్స్ షో.. ఇంకో చానల్‌లో సింగింగ్ షో.. ఇలా నిత్యం పదుల సంఖ్యల్లో షోలు టెలికాస్ట్ అవుతుంటాయి. అయితే ఈ షోలలో ఎక్కువగా సీరియల్ నటీనటులలతో పాటు ‘బిగ్‌బాస్’ మాజీ కంటెస్టెంట్స్ కనిపిస్తుంటారు.
యాంకర్‌గానో..జడ్జిగానో..టీమ్ లీడర్‌గానో..లేదా స్పెషల్ గెస్ట్ గానో ఏదో ఒకరకంగా వాళ్లు టీవీల్లో సందడి చేస్తుంటారు. శ్రీముఖి, లాస్య, శివజ్యోతి, అరియానా, శోభా శెట్టి, విష్ణుప్రియ..ఇలా చాలామంది బిగ్‌బాస్ ప్లేయర్స్ ఇప్పుడు వరుస షోలతో బిజీ అయిపోయారు. కానీ బిగ్‌బాస్‌తో ఎంతో పేరు సంపాదించున్న కీర్తి భట్ మాత్రం ఎలాంటి షోలలో కనిపించడం లేదు. బిగ్‌బాస్ షో టెలికాస్ట్ అయ్యే చానల్‌లో సైతం ఆమె కనిపించడం లేదు. తాజాగా దీనికి గల కారణాన్ని బయటపెట్టింది కీర్తి భట్. అందరిలానే తాను గ్లామర్ షో చేయనని..వాళ్లు చెప్పినట్లుగా చిన్న చిన్న దుస్తులు ధరించలేనని..అందుకే తనని ఏ షోకి పిలవరని అంటోంది.
అడుక్కోవడం నచ్చదు
నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో ‘అమ్మాయిలు గ్లామర్‌గా ఉంటేనే బుల్లితెర షోలకు పిలుస్తారు. వాళ్లు చెప్పినట్లుగా మోకాళ్ల వరకు దుస్తులు వేసుకునే వాళ్లకే అవకాశం ఇస్తారు. నేను అలా చేయలేను. అందుకే నాకు అవకాశాలు రావు’ అని చెబితే కొంతమంది పర్సనల్‌గా తీసుకొని ఫీలయ్యారు. నా ఫ్రెండ్స్ అపార్థం చేసుకున్నారు. కానీ నేను చెప్పింది నిజం. అలా అని వాళ్ల డ్రెసింగ్‌పై కామెంట్స్ చేయడం సరికాదు. నేను అలా వేసుకోలేను. చలాకీగా మాట్లాడలేను. అందుకే నాకు అవకాశాలు ఇవ్వరు. చాన్స్ ఇవ్వమని నేను ఎవరిని అడిగే రకం కూడా కాదు. అలా అడిగితే ఛీప్ అయిపోతాం. ఎంత కష్టం వచ్చినా ఇంకొకరి సహాయం తీసుకోకూడదనే వ్యక్తిత్వం నాది.
ఎవరూ సపోర్ట్ చేయలేదు
బిగ్‌బాస్ వల్ల నా కెరీర్‌కి ఎలాంటి ప్రయోజనం జరగలేదు. ఆ షో వల్ల నేను జనాలకు దగ్గరైన మాట నిజమే. కానీ కెరీర్ పరంగా మాత్రం ఏం యూజ్ కాలేదు. షో ద్వారా వచ్చిన ఫేంతో నాకు అవకాశాలు రాలేదు. టాప్ 5, 10లో ఉన్నవాళ్లను ఆఫర్స్ వచ్చాయి. అలా కొంతమందికి బిగ్‌బాస్ షో కలిసొచ్చింది. నా వరకు అయితే ఈ షోతో నా కెరీర్‌లో ఎలాంటి మార్పులు రాలేదు.
అయితే షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ప్రవర్తను మార్చుకున్నా. బిగ్‌బాస్‌కి వెళ్లే ముందు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఎవరు ఎవరికీ లేరు. మనం దగ్గర ఉన్నంత వరకు మాత్రమే మాట్లాడారు. నేను చాలా త్వరగా మనుషులను నమ్మేస్తాను. కొంచెం మంచిగా మాట్లాడితే నా వాళ్లే అనుకుంటాను. అన్ని చెప్పేస్తా. ఇప్పుడు నమ్మకం అనే పదంపైనే నాకు నమ్మకం పోయింది’ అని కీర్తి భట్ చెప్పుకొచ్చింది.
కాగా కార్తీకదీపం, మనసిచ్చిచూడు వంటి సీరియళ్లతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కీర్తి..బిగ్‌బాస్ సీజన్ 6లో పాల్గొని.. తనదైన ఆటతీరుతో టాప్ 3 లో స్థానం సంపాదించుకుంది. సింగర్ రేవంత్ ఆ సీజన్ విన్నర్‌గా నిలిచాడు.