
త్రిష, మణిరత్నం, కమల్‌హాసన్, శింబు, అశోక్ సెల్వన్, తనికెళ్ల భరణి
‘‘నేను మనసు పెట్టి చేసిన ప్రతి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. ‘థగ్ లైఫ్’ కూడా మనసుపెట్టి చేసిన సినిమా. అద్భుతమైన టీమ్‌తో పని చేశాను. గొప్పగా సెలబ్రేట్ చేసుకునే ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు. మణిరత్నంగారు, నా కాంబినేషన్‌లో వచ్చిన ‘నాయకుడు’ చిత్రం కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద విజయం సాధిస్తుంది... ఇది నాప్రామిస్’’ అని కమల్‌హాసన్ చెప్పారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన చిత్రం ‘థగ్ లైఫ్’. శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలుపోషించారు.
రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా మీట్‌లో కమల్‌హాసన్ మాట్లాడుతూ– ‘‘నన్ను ద్రోణాచార్యతోపోల్చారు. కానీ, కాదు... ఇప్పటికీ విద్యార్థినే. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మణిరత్నంగారి సినిమాలో నేను యాక్ట్ చేయను... జస్ట్ బిహేవ్ చేస్తాను. మేమంతా సినిమా అభిమానులం.
సినిమాని ఎప్పుడు కూడా భుజాలపై మోస్తాం. నేను తెలుగులోనే స్టార్‌గా ఎదిగాను. అందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. మణిరత్నం మాట్లాడుతూ– ‘‘నాయకుడు’ తర్వాత ఇన్నేళ్లకు కమల్‌గారితో ‘థగ్ లైఫ్’ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. దర్శకుడికి సపోర్ట్ చేసే హీరో ఆయన’’ అని తెలిపారు. ‘‘నేను ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది.
‘థగ్ లైఫ్’ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని నటి సుహాసినీ మణిరత్నం పేర్కొన్నారు. ‘‘మణిరత్నంగారి క్రమశిక్షణ, టైమింగ్ అద్భుతం. కమల్‌గారితో వర్క్ చేయడం గొప్ప అనుభూతి’’ అన్నారు శింబు. ‘‘మణిరత్నం, కమల్‌హాసన్‌గార్లతో పని చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను’’ అని త్రిష చెప్పారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ చూసిన తర్వాత కమల్ సార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది’’ అన్నారు.