Jagame Thandhiram Movie Review:అర్థంపర్థం లేని... అతుకుల బొంత

Jagame Thandhiram Movie Review And Rating In Telugu - Sakshi

చిత్రం:జగమే తంత్రం
తారాగణం: ధనుష్, జేమ్స్ కాస్మో, ఐశ్వర్య లక్ష్మి, జోసెఫ్ జార్జ్, శరత్ రవి
సంగీతం: సంతోష్ నారాయణన్
స్టంట్స్: దినేశ్ సుబ్బరాయన్;
కెమెరా: శ్రేయస్ కృష్ణన్;
ఎడిటింగ్: వివేక్ హర్షన్;
రచన, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
రిలీజ్: 2021 జూన్ 18( నెట్ ఫ్లిక్స్)

ఇద్దరు వేర్వేరు గ్యాంగ్ లీడర్లు. వాళ్ళ మధ్య పోరు. అనుకోకుండా అందులో ఓ గ్యాంగ్ లీడర్ పక్షాన హీరో నిలబడతాడు. రెండోవాణ్ణి ఏకంగా పైకి పంపేస్తాడు. తీరా ఆ గ్యాంగ్ లీడర్ బాస్ మీద భ్రమలు తొలగి, హీరో అతనికి ఎదురు తిరుగుతాడు. ఆ బాస్ నే ఓడిస్తాడు. ఇలాంటి కథలు కొన్ని వందలు, వేలు చూసేసి ఉంటాం. దీనికి బ్రిటన్ లోని లండన్ నేపథ్యం, శ్రీలంక తమిళ సమస్య, శరణార్థుల వివాదం లాంటి అనేకానేక అంశాలు, లేనిపోని సిద్ధాంతాలు, రాద్ధాంతాలు కలగలిపేస్తే – అది ‘జగమే తంత్రం’. బ్రిటన్ లోని భారీ గ్యాంగ్ లీడర్ కు మదురైలో ఓ పరోటా కొట్టు నడిపే చిన్న గ్యాంగ్ లీడర్ హీరో కాస్తా కాంట్రాక్ట్ దాదాగా కావాల్సి రావడం లాంటివి మన సినిమాల్లోనే జరుగుతాయి. అలాంటి చిత్రాతిచిత్రమైన ఊహలకు వెండి తెర రూపం – ఈ సినిమా. 

కథేమిటంటే..
లండన్ లో పీటర్ (జేమ్స్ కాస్మో), శివదాస్ (జోసెఫ్ జోజు జార్జ్) - ఇద్దరూ రెండు వేర్వేరు గ్యాంగ్ ల లీడర్లు. ఇద్దరి మధ్య తగాదాలు. ఇరు వర్గాల చెరో హత్యతో సినిమా మొదలవుతుంది. అదే సమయంలో మదురైలో పరోటా కొట్టు నడుపుతూనే, లోకల్ దాదాగా ఎదిగిన వ్యక్తి – సురుళి (ధనుష్). పదుల కొద్దీ హత్యలు చేసిన హీరోను శివదాస్ కు అడ్డుకట్ట వేయడానికి ఓ నెల రోజుల పాటు కాంట్రాక్ట్ దాదాగా లండన్ రప్పిస్తాడు పీటర్. హీరో అక్కడ శివదాస్ నే నమ్మించి, మోసం చేస్తాడు హీరో. శరణార్థుల కోసం పనిచేస్తున్న శివదాస్ అండ్ గ్యాంగ్ చేస్తున్న మంచి పని తెలియకుండానే, తెలుసుకోకుండానే ఆయనను చంపేస్తాడు. 

జాత్యహంకారి అయిన పీటర్ ఆ దేశంలో శరణార్థులకు చోటు లేకుండా చేసే చట్టాన్ని తీసుకురావడం కోసం అదంతా చేస్తున్నాడని హీరో తెలుసుకుంటాడు. ద్రోహిగా ముద్ర పడి, చివరకు కన్నతల్లి సైతం అసహ్యించుకొనే స్థితికి చేరిన హీరో తన పాప ప్రక్షాళన కోసం ఏం చేశాడు? చివరకు ఏం జరిగిందన్నది జాత్యహంకారం, తమిళుల స్వయం ప్రతిపత్తి పోరాటం లాంటి అతి బరువైన విషయాల్ని అర్థం పర్థం లేకుండా కమర్షియల్ పద్ధతిలో కలిపిన ఈ రెండున్నర గంటల సినిమా. 


ఎలా చేశారంటే..
ధనుష్ ఎప్పటి లానే తన ఆకారానికి సంబంధం లేని ఆట, పాట, ఫైట్లు, తుపాకీలు పేల్చడాలతో హడావిడి చేశారు. విలన్ ఛాయలుండే ఇలాంటి హీరో పాత్రలు చేయడం ఆయనకూ కొత్త కాదు. చూడడం ప్రేక్షకులకూ కొత్త కాదు. కాకపోతే, ఈసారి ధనుష్ నటన కన్నా హీరోయిజానికే అతిగా ప్రాధాన్యం ఇచ్చినట్టున్నారు. మొదట రైలులో మర్డర్ దగ్గర నుంచి క్లైమాక్స్ లో దీపావళి టపాసులు, తుపాకీలు పేల్చినట్టు మెషిన్ గన్ ఆపరేట్ చేయడం దాకా ఈ తమిళ స్టార్ హీరో... ఏకంగా సూపర్ హీరో అనిపించేస్తారు. ఆ ప్రయాణంలో ఆ పాత్ర, ఆ నటుడు సహజత్వం కోల్పోయారు. 

లండన్ లోని విలన్ పీటర్ పాత్రలో జేమ్స్ కాస్మో భయంకరుడిగా కనిపించినా, క్లైమాక్స్ కు వచ్చేసరికి అతి బలహీనుడిగా దర్శనమిస్తారు. హీరో ప్రేమించే అమ్మాయి పాత్రలో ఐశ్వర్య లక్ష్మి చేసిందీ, చేయగలిగిందీ ఏమీ ఉన్నట్టు లేదు. లండన్ లో స్థిరపడ్డ తమిళుడు, శరణార్థుల పాలిట దైవమైన గ్యాంగ్ స్టర్ శివదాస్ పాత్రలో జోసెఫ్ జోజు జార్జ్ చూపులకు బాగున్నారు. కమ్యూనిజమ్ పుస్తకాలు చదువుతూ, శరణార్థుల పాలిట రాబిన్ హుడ్ లాంటి ఆ పాత్రను పండించడానికి వీలైనంత శ్రమించారు. హీరో పక్కన ఉండే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విక్కీగా శరత్ రవి ట్రాక్ అక్కడక్కడ నవ్విస్తారు. మిగతావాళ్ళంతా తమ పరిధి మేరకు నటించారు. 

ఎలా తీశారంటే..
‘సామాన్యుడినైన నాకు శ్రీలంక తమిళుల సమస్య ఓ న్యూస్ క్లిప్పింగే కానీ, అంతకు మించి నాకు తెలీదు’ అని సినిమాలో ఒకచోట హీరో పాత్ర, హీరోయిన్ తో అంటుంది. ప్రేక్షకుల దృష్టిలోనూ వాస్తవం కూడా అంతే. తమిళులకు సరే కానీ, ఇతర ప్రాంతాల వారికి పెద్దగా తెలియని, పట్టని శ్రీలంక తమిళ శరణార్థుల సమస్యను స్పృశిస్తూ మణిరత్నం ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’ (తెలుగులో ‘అమృత’) సహా అనేక సినిమాలు ఇప్పటికే వచ్చాయి. ఇటీవల ‘ఫ్యామిలీ మ్యాన్ -2’ వెబ్ సిరీస్ లోనూ ఆ నేపథ్యం చూశాం. అయితే, కథలో ఎమోషన్లు ఉంటే ఫరవాలేదు కానీ, అవి లేకుండా ఒక ప్రాంతానికీ, ప్రజానీకానికీ మాత్రమే తెలిసే తమిళ శరణార్థుల సమస్యను ప్రాతిపదికగా తీసుకొని, సినిమా కథంతా నడపడం ఇబ్బందికరమే! ‘జగమే తంత్రం’లో పదే పదే ఆ ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తుంటుంది.  

గతంలో ‘పిజ్జా’, ‘జిగర్తాండ’ లాంటి సినిమాలతో విభిన్నమైన తమిళ సినీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్ తన స్వీయ రచన, దర్శకత్వంలో ఈసారి బాగా నిరాశపరిచారు. లండన్ లో క్రూరమైన మాఫియా లీడర్ లాంటి విలన్ ఎక్కడో మదురైలోని తమిళ దాదా సాయం కోరడం ఓ ఫార్సు. అన్నేళ్ళుగా అక్కడ శివదాస్ అండ్ కో చేస్తున్న దందా ఏమిటో, దాని ఆనుపానులు ఏమిటో – అంత లావు విలన్ కూ హీరో చెప్పేటప్పటి దాకా తెలియదనడం మరో జోక్. వారానికి రెండు మిలియన్ల పౌండ్ల కిరాయికి లండన్ వచ్చిన ఇంగ్లీషైనా రాని మదురై హీరో రెండ్రోజుల్లో శివదాస్ గ్యాంగ్ వ్యవహార శైలి అంతా చెప్పేస్తుంటాడు. అదేమిటో అతనికి అన్నీ అలా తెలిసిపోతుంటాయి. 

లండన్ వీధుల్లో ‘లిటిల్ మదురై’ అంటూ ఆర్ట్ డైరెక్టర్లు ఓ ఏరియాను తెరపై అందంగా సృష్టించారు. విలన్ తో శివదాస్ రాజీ మీటింగ్ ఘట్టంలోని రెడ్ కలర్ కాంబినేషన్, ఆ చిత్రీకరణ, సినిమాలో చాలా చోట్ల కెమేరా వర్క్ బాగుంది. తమిళ శరణార్థులపై వచ్చే నేపథ్య గీతం మినహా, సినిమా అంతా తమిళ శైలి టప్పాంకుత్తు పాటలే. మాస్ ను మెప్పించడం కోసం పాత హిట్ పాటల్ని సినిమాలో నేపథ్యంలో చాలాసార్లు వాడుకున్నారు. 

హీరోయిజమ్ మీద చూపిన శ్రద్ధలో కాస్తంత కథ మీదా పెడితే బాగుండేది. కన్వీనియంట్ స్క్రీన్ ప్లే, ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ లాంటి వెన్నో ఈ చిత్రాన్ని కుంగదీశాయి. ‘శ్రీలంకలో తమిళుణ్ణి. తమిళనాడులో నేను శరణార్థిని’ అంటూ ఓ పాత్ర తన ఉనికి కోసం, తన మూలాల కోసం ఆవేదనతో అనే మాటలు ఆలోచింపజేసేవే. కానీ, ఆ బరువైన అంశాల్ని ఎంతో గొప్ప నిర్మాణ విలువలతో తెరకెక్కించినా – కథలో పస లేకపోతే ఏం చేస్తాం! ఏం చూస్తాం!!

బలాలు 
- ధనుష్ స్టార్ ఇమేజ్
- వివిధ లొకేషన్లు, నిర్మాణ విలువలు
- కెమెరా, కళా దర్శకత్వం

బలహీనతలు 
లాజిక్ లేని బలహీనమైన కథ, కథనం
బోలెడన్ని రచన, దర్శకత్వ లోపాలు, కన్వీనియంట్ స్క్రీన్ ప్లే
కథకు అతకని శరణార్థుల అంశం
పిచ్చి హీరోయిజం, పొసగని పాటలు

కొసమెరుపు: తెరపై విలన్ పదే పదే అడిగినట్టు... ఈ సినిమాకు ‘సే యస్ ఆర్ నో’ అంటే... నిర్మొహమాటంగా... ‘ఎ బిగ్... నో’! 
-----  రెంటాల జయదేవ 

Rating:  
(1.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top