Happy Mother's Day 2023: అప్పట్నుంచి అన్నీ అమ్మతో అన్ని షేర్‌ చేసుకుంటున్నాను: శ్రీలీల

International Mothers Day: My mother is a super woman says Sreeleela - Sakshi

– శ్రీలీల

‘‘నేనెక్కడ ఉంటే మా అమ్మకు అదే ఫేవరెట్‌ ప్లేస్‌. మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుంది? ఇంటిని బాగా చూసుకోవడంతో పాటు ఇతరులకు సహాయం చేయం అమ్మకు ఇష్టం. మా అమ్మ బెస్ట్‌ పర్సన్‌’’ అన్నారు శ్రీలీల. ‘పెళ్లి సందడి’తో తెలుగుకి పరిచయం అయిన ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం చేతిలో అరడజనకు పైగా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. నేడు ‘మాతృదినోత్సవం’ సందర్భంగా తన తల్లి స్వర్ణలత గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా శ్రీలీల షేర్‌ చేసుకున్న విషయాలు ఈ విధంగా..

► మా అమ్మగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. అలానే ఆమెకి చాలా ఓర్పు ఎక్కువ. నాకు ఎప్పుడు స్వేచ్ఛ ఇవ్వాలో.. ఇవ్వకూడదో ఆమెకు బాగా తెలుసు. అలాగే ఏ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండాలో.. ఉండకూడదో కూడా బాగా తెలుసు.

► నా స్కూల్‌ డేస్‌లో చాలా బిజీగా ఉండేదాన్ని. స్కూల్‌ అవ్వగానే డ్యాన్స్‌ క్లాస్, స్విమ్మింగ్‌.. ఇలా గడిచిపోయేది. కానీ నాకేమో అల్లరి చేయాలని ఉండేది. అయితే దానికి చాన్స్‌ ఉండేది కాదు. ఎందుకంటే మా అమ్మ కళ్లన్నీ నా మీదే ఉండేవి.

► తిండి విషయంలో చిన్నప్పుడు నేను చాలా నిర్లక్ష్యంగా ఉండేదాన్ని. స్కూల్‌కి వెళ్లేటప్పుడు అమ్మ ఇచ్చిన లంచ్‌ బాంక్స్‌ ఇంట్లో సోఫా వెనకాలో, కారు సీటులోనో దాచేసేదాన్ని. తినడానికి ఇష్టపడక అలా చేసేదాన్ని.

► ఇక నా విషయాలను నేను హ్యాండిల్‌ చేయగలననే నమ్మకం కుదిరాక మా అమ్మ నాకు స్వేచ్ఛ ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటినుంచి మా అమ్మ నాకు మంచి ఫ్రెండ్‌లా అయిపోయారు. ఎప్పుడైతే మా అమ్మ నాకు ఫ్రెండ్‌లా అయ్యారో అప్పట్నుంచి అన్నీ ఆమెతో షేర్‌ చేసుకుంటున్నాను. రాత్రిపూట జోక్స్‌ చెప్పుకోవడం, రిలాక్స్‌ అవ్వడం.. డ్యాన్స్‌ చేయడం... వాట్‌ నాట్‌.. మేం చాలా బాగా టైమ్‌ స్పెండ్‌ చేస్తాం. తన కూతురు కావడం నా లక్‌.

► మా అమ్మగారు మల్టీ టాస్కర్‌. అందుకే తనకి రెస్ట్‌ ఇవ్వాలని అనుకుంటుంటాను. అదే విషయం ఆమెతో చెబితే ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే అమ్మకు ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు. ఏదో పని పెట్టుకుని, ఆ పని పూర్తి చేసేంతవరకూ ప్రశాంతంగా ఉండరు.

► మా అమ్మగారు డాక్టర్‌. షేషెంట్లతో ఎప్పుడూ ఫుల్‌ బిజీ. కొన్నేళ్ల పాటు అవిడ డాక్టర్‌గా సర్వీస్‌ చేశారు. పైగా శ్రద్ధగా చేయడంతో ఎందరో పేషెంట్స్‌ ఆమెతో చాలా సన్నిహితంగా ఉండేవారు. చాలా గౌరవించేవారు. ఇవన్నీ స్వయంగా చూసిన నాకు మా అమ్మంటే చాలా గౌరవం.. గర్వం.. స్ఫూర్తి కూడా. నేను ఆవిడ్ని ‘సూపర్‌ ఉమన్‌’ అంటాను. ఆవిడ సెమినార్స్‌లో పాల్గొన్నప్పుడు నేను చాలా ఆరాధనగా చూసేదాన్ని. ఆవిడకున్న నాలెడ్జ్‌ సూపర్‌.

► మా అమ్మ నాలో భాగం. నా కెరీర్‌లోనూ ఆమె సగ భాగం. చాలా అర్థం చేసుకుంటారు. నా కెరీర్‌కి ఎంత హెల్ప్‌ చేయాలో అంతా చేస్తారు. నేనివాళ ఇంత బిజీగా సినిమాలు చేయగలుగుతున్నానంటే ఆమె సపోర్ట్‌ కారణం.

► ఫెయిల్యూర్స్‌ వచ్చినప్పుడు ‘వాట్‌ నెక్ట్స్‌’ అంటారామె. కొంచెం కూడా బాధపడరు. నేనేమో ‘సెన్సిటివ్‌’. చిన్న విషయాలకు కూడా బాధపడిపోతుంటాను. నేను ఆ బాధ మరచి పోయేలా ఆమె కౌన్సిలింగ్‌ ఇస్తారు. అమ్మ స్పిరిచ్యువాల్టీ పర్సన్‌. ప్రతిరోజూ దేవుడిని పూజిస్తుంటారు. ఆ పూజలు నాకు ధైర్యాన్నిస్తాయి. ఆవిడ ఆశీర్వాదం తీసుకున్నప్పుడు నా ధైర్యం రెట్టింపు అవుతుంది. ∙‘మదర్స్‌ డే’కి మా అమ్మ కోసం స్పెషల్‌గా ఒకటి ప్లాన్‌ చేశాను. అది సీక్రెట్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top