రామ్‌చరణ్‌ కండల సీక్రెట్‌ అతడే | Interesting Facts About Ram Charan Fitness Trainer Rakesh Udiyar | Sakshi
Sakshi News home page

రామ్‌చరణ్‌ కండల సీక్రెట్‌ అతడే.. దాబాలో పని చేస్తూ..

Jan 20 2026 5:18 PM | Updated on Jan 20 2026 5:36 PM

Interesting Facts About Ram Charan Fitness Trainer Rakesh Udiyar

టాలీవుడ్‌లో ఇప్పుడు బెస్ట్‌ ఫిజిక్‌ను స్క్రీన్‌పై చూపించడానికి  స్టార్స్‌ పోటీపడుతున్నారు.  పెద్ది సినిమా కోసం రామ్‌ చరణ్‌ కఠినమైన కసరత్తులతో ఫిజిక్‌ను తీర్చిదిద్దుకుంటున్నాడు.దీనికి నిదర్శనంగానా అన్నట్టు... లేటెస్ట్‌గా బయటకు వచ్చిన ఆయన ఫిట్‌ లుక్‌ బాగా వైరల్‌ అయింది. సినిమాకి డైరెక్టర్‌ ఎంత ముఖ్యమో హీరోల ఫిజిక్‌లకు ట్రైనర్‌  కూడా అంతే.  మరి రామ్‌ చరణ్‌ లుక్‌ని ఈ రేంజ్‌లో క్లిక్‌ అయ్యేలా చేసిన ఆ ట్రైనర్‌ ఎవరు? ఆయన నేపధ్యం ఏమిటి?

ఆయనే ముంబయికి చెందిన రాకేష్‌ ఉడియార్‌. ఆమిర్‌ ఖాన్‌  సల్మాన్‌ ఖాన్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా బాలీవుడ్‌కి సుపరిచితుడైన రాకేష్‌ ఇప్పుడు దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే సెలబ్రిటీ ట్రైనర్స్‌లో ఒకడు. ఎంత శ్రద్ధగా సెలబ్రిటీల శరీరాలను తీర్చిదిద్దుతున్నాడో అంతే శ్రద్ధగా ఆయన తన జీవితాన్ని కూడా నిర్మించుకున్నారని ఆయన విజయాల వెనుక ఉన్న కధ వెల్లడిస్తుంది. ఆయన గతంలో ఒకసారి తన స్ఫూర్తిదాయక జీవితం గురించి మీడియాతో పంచుకున్నాడు.

రాకేష్‌ జీవితం చాలా కష్టాలతో గడిచింది.అతని తండ్రికి పక్షవాతం వచ్చిన తర్వాత, చిన్న వయసులోనే రాకేష్‌ లోకల్‌ రైళ్లలో చిన్న చిన్న వస్తువులు అమ్మేవాడు.  అతని సోదరుడితో కలిసి రోజుకు సుమారు 25 రూపాయలు సంపాదించేవారు. తర్వాత, రాకేష్‌ తల్లికి ఒక ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగం దొరికింది,  ఆ ఇంటి యజమాని ఆ ఇద్దరు తోబుట్టువులను పాఠశాలకు పంపడానికి ముందుకొచ్చారు. రాకేష్‌ అదే సమయంలో ఒక దాబాలో కూడా పనిచేశాడు.

‘‘నాకు ఎప్పుడూ ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉండేది  దాని గురించి విస్త్రుతంగా పుస్తకాలు చదివేవాడిని. 16 ఏళ్ల వయసులో, నాకు ఒక జిమ్‌లో స్వీపర్‌గా ఉద్యోగం వచ్చింది, ఆ తర్వాత ఫ్లోర్‌ ట్రైనర్‌గా పదోన్నతి పొందాను. చివరికి, నేను ఫ్రీలాన్సర్‌గా మారి సెలబ్రిటీలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను,’’ అని ఫిట్‌నెస్‌ రంగంలోకి తన ప్రవేశాన్ని గుర్తుచేసుకుంటూ రాకేష్‌ చెప్పాడు. సల్మాన్‌ ఖాన్‌ రాకేష్‌  ప్రముఖ క్లయింట్లలో ఒకరు. ‘‘నేను  అర్బాజ్‌ ఖాన్‌(సల్మాన్‌ సోదరుడు) కు శిక్షణ ఇస్తున్నప్పుడు, సల్మాన్‌ నాకు ఫోన్‌ చేసి, బాడీగార్డ్‌ సినిమా కోసం తనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు’’ అంటూ రాకేష్‌ గుర్తు చేసుకుంటాడు.  అప్పటి నుంచీ రాకేష్‌ సల్మాన్‌కు పర్సనల్‌ ట్రైనర్‌గా కొనసాగుతున్నాడు.   ఇక మరో బాలీవుడ్‌ టాప్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ తన పీకే సినిమా ప్రారంభించడానికి ముందే, రాకేష్‌కు ఫోన్‌ చేసి తన ట్రైనర్‌గా ఉండమని అడిగాడట. అప్పటి నుంచీ వీరిద్దరి జోడీ కూడా కంటిన్యూ అవుతోంది.

రామ్‌చరణ్‌తో పరిచయం అలా...
‘ధ్రువ’ సినిమా సమయంలో తొలిసారి పూర్తిగా కండలు తిరిగిన గ్రీకు శిల్పం లాంటి శరీరం కావాలనుకున్నప్పుడు మన టాలీవుడ్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు రాకేష్‌ పేరును సూచించింది సల్మానే. ‘‘చరణ్‌ సల్మాన్‌ లు మంచి స్నేహితులు.ఆ సినిమా కోసం ది బెస్ట్‌ ఫిజిక్‌తో ఫిట్‌గా కనపడాలని చరణ్‌ అనుకున్నాడు’’ అని రాకేష్‌ చెప్పాడు. అప్పటి నుంచి రామ్‌ చరణ్‌తో రాకేష్‌ పనిచేస్తున్నాడు. ‘‘చరణ్‌కు శిక్షణ ఇవ్వడానికి నేను హైదరాబాద్, ముంబయి మధ్య రాకపోకలు సాగిస్తుంటాను. చరణ్‌ తరచుగా నన్ను సంప్రదిస్తాడు. ఆయన అవసరాలకు అనుగుణంగా తన వర్కవుట్, పోషకాహారం మొదలైన వాటి గురించి నేను ఒక ప్రణాళికను రూపొందిస్తుంటాను’’ అంటూ రాకేష్‌ వివరిస్తున్నాడు.

రామ్‌చరణ్‌ మాత్రమే కాదు దియా మీర్జా, కునాల్‌ కపూర్, డైసీ షా  పుల్కిత్‌ సామ్రాట్‌తో సహా తారలెందరికో రాకేష్‌ శిక్షణ ఇచ్చాడు.   ‘‘నటీనటులు తమ పాత్రల కోసం బరువు తగ్గుతూ, పెరుగుతూ ఉంటారు, ఆ సమయంలో వారికి వైద్యులు  శిక్షకులు దగ్గరగా పనిచేస్తాం; ఆ లుక్‌ పొందడానికి ఒక ఫిట్‌నెస్‌ ప్రణాళిక  ఆహారం అందిస్తాం. ఉదాహరణకు దంగల్‌ సినిమా కోసం, ఆమిర్‌ఖాన్‌ 97 కిలోల నుంచి బరువు తగ్గాల్సి వచ్చింది  దానిని సాధించడానికి అతనికి సరైన బృందం సహాయం చేసింది.’అదే విధంగా మరో సినిమా కోసం రామ్‌ చరణ్‌ సన్నగా మారాలని ఆశించారు’’ అంటూ రాకేష్‌ గుర్తు చేసుకుంటాడు. ’ ఆమిర్‌  సల్మాన్, రామ్‌ చరణ్‌ లు  ఎంత పెద్ద బిజీ హీరోలైనా తమ వర్కౌట్‌ సెషన్‌ల విషయంలో అలసత్వం చూపరని చాలా పట్టుదలగా ఉంటారని రాకేష్‌ వెల్లడించాడు. ‘సల్మాన్‌ ఎంత అలసిపోయినా లేదా ఇంటికి ఆలస్యంగా వచ్చినా,  జిమ్‌కు వెళ్లడం మానడు.  అతనికి తినడం అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా తన తల్లి వంటకం అంటే మరీ ఇష్టం, కానీ అతను ఎప్పుడూ అదనపు కేలరీలు పెరగనివ్వడు,‘ అని రాకేష్‌ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement