సినిమాల్లో రాజకీయాలు ఎక్కువ.. తట్టుకోలేకే..

Hero Raja Said Lost My Parents And Troubled For 100 Rupees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఓ చినదాన’ సినిమాతో హీరోగా పరిచమైన రాజా ఆ తర్వాత ‘వెన్నెల’, ‘ఆనంద్‌ మంచి కాఫీ లాంటి సినిమా’లతో లవర్‌ బాయ్‌గా మారారు. అలా స్టార్‌ హీరోల జాబితాలో చేరిన రాజా ప్రస్తుతం పాస్టర్‌గా సెటిలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..  హీరోగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాని చెప్పుకొచ్చారు. ‘ఐదేళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. 14 ఏళ్లు వచ్చే సరికి తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఇక నన్ను నా ఇద్దరూ అక్కలే పెంచారు. దేవుడు ఒక తల్లిని తీసుకెళ్లి ఆ స్థానంలో ఇద్దరు తల్లులను ఇచ్చాడు’ అని భావోద్వేగానికి లోనయ్యారు.

‘హీరో కావాలన్న కోరికతో అవకాశాల కోసం రోజూ సినిమా ఆఫీసుల చూట్టూ తిరిగేవాడిని. అలా ఓ రోజు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ ఆఫీసుకు వెళ్లినప్పుడు ఆయన నాతో నువ్వు హీరో ఏంటీ నీ మొహం అద్దంలో చూసుకున్నవా అంటూ ఘోరంగా అవమానించి పంపించారు. అయితే ఆయన మాట ఎలా ఉన్న ఆతను మాత్రం చాలా మంచి వ్యక్తి’ అని రాజా చెప్పుకొచ్చారు. అయితే సినిమా చాన్స్‌ల కోసం ఎదురుచూస్తున్న సమయం‍లో వంద రూపాయలు కూడా లేక ఇబ్బందులు పడిన సందర్భాలు, అవమానాలు పడిన రోజులు చాలానే ఉన్నాయని తనకు ఎదురైన చేదు అనుభవనాలను గుర్తుచేసుకున్నారు. ఇక ఛీ ఇదేం బతుకురా బాబు అని ఒకానొక సందర్భంలో విరక్తితో చనిపోవాలని కూడా అనుకున్నానన్నారు. కానీ అందరూ పుడతారు.. చస్తారు. నాకు అలాంటి బతుకొద్దు, అలాంటి చావు వద్దు అనుకున్నా. నేను బతికినా, చచ్చినా గొప్పగా ఉండాలనుకున్నాను అన్నారు.

దీంతో హీరో అవ్వాలని గట్టిగా నిర్ణయించుకుని మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించానన్నారు. ఈ క్రమంలో ఆనంద్ సినిమా స్క్రిప్ట్‌ను శేఖర్ కమ్ముల తనకు వినిపించడంతో కథ​ నచ్చి వెంటనే ఒకే చెప్పానన్నారు. ఈ నేపథ్యంలో కెరీర్ మొదట్లో సాఫీగా సాగినా, తర్వాత తన సినిమాలకు థియేటర్లు దొరికేవి కాదని, బడా నిర్మాతలతో గొడవలకు కూడా దిగానని చెప్పారు. తనకు బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో వాళ్లను ఎదిరించి ఇండస్ట్రీలో కొనసాగలేకపోయానని చెప్పారు. ఇండస్ట్రీలో పాలిటిక్స్ ఎక్కువని, అందుకే సినిమాలు చేయడం మానేశానని తెలిపారు. హీరో కాకముందు, హైదరాబాద్‌లోని గ్రీన్ పార్క్ హోటల్లో రిసెప్షనిస్టుగా పనిచేసినట్లు రాజా ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే సినిమాలు చేయడం ఆపేశాక అనుకోకుండా పాస్టర్ అయిన రాజ 2014లో అమృతను క్రిస్టియన్‌ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి లియోరా అనే కూతురు కూడా ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top