
పవన్ కల్యాణ్ నటించిన తొలి పాన్-ఇండియన్ సినిమ 'హరి హర వీరమల్లు' నెలరోజుల్లోనే ఓటీటీలోకి రానుంది. ఈమేరకు సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. జులై 24న విడుదలైన ఈ చిత్రానికి క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సుమారు రూ. 250 కోట్లతో ఎ.ఎం.రత్నం నిర్మించారు. అయితే, మొదటి ఆటతోనే భారీ డిజాస్టర్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో సుమారు రూ. 110 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
'హరి హర వీరమల్లు' ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఆగష్టు 22న ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని మొదట ఢీల్ సెట్ చేసుకున్నారట. అయితే, సినిమా డిజాస్టర్గా మిగలడంతో నిర్మాతలు తమ ప్లాన్లో మార్పులు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం వీరమల్లు డిజిటల్ విడుదల విషయంలో పరిశీలిస్తున్నారట.. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్ట్రీమింగ్కు తీసుకురావలనే ప్లాన్లో ఉన్నారట. అదే జరిగితే 30రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసినట్లు అవుతుంది. అయితే, ఓటీటీ విడుదల విషయంలో మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
'హరి హర వీరమల్లు' విడుదలతోపాటు వివాదాలను కూడా తీసుకొచ్చింది. కోహినూర్ వజ్రానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానమున్నది. దానిది అంతర్జాతీయ ఖ్యాతి. అయితే, ఈ చారిత్రక అంశాల మధ్య వీరమల్లు అనే కల్పిత పాత్రను ప్రవేశపెట్టి ఈ సినిమా తీయడంతో చాలామంది తప్పుబట్టారు. కల్పిత వీరమల్లు ఔరంగజేబుతో పోరాడి గోల్కొండకు వజ్రాన్ని ఎలా తీసుకువస్తాడనేది సినిమా కథగా చెప్పడం ఏంటంటూ విమర్శించారు. ఫాంటసీ పేరుతో చరిత్రను వక్రీకరించడం.. ఆ వక్రీకరణ ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా సినిమా ఉందంటూ కొందరు పేర్కొన్నారు. ఇలా అనేక కారణాల వల్ల సినిమాకు ఎక్కువ నష్టం జరిగింది.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా.. బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. నాసర్, సునీల్, దలీప్ తాహిల్, ఆదిత్య, సచిన్ ఖేడేకర్ కూడా ఉన్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.