
అనుష్క శెట్టి వెండితెరపై కనిపించి రెండేళ్లు అవుతుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’(2023) తర్వాత ఆమె నుంచి వచ్చిన తాజా చిత్రం ‘ఘాటి’(Ghaati). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ..ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(Ghaati Movie Review ).
కథేంటంటే..
శీలావతి.. ఖరీదైన గంజాయి. ఇది ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది. అక్కడ పండిన గంజాయి పంటను కోసి, బయటకు తీసుకొచ్చే సత్తా ఘాటీలకు మాత్రమే ఉంటుంది. అలా బయటకు తీసుకొచ్చిన గంజాయిని డ్రగ్స్ మాఫీయా లీడర్ కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), అతని తమ్ముడు కుందుల నాయుడు(చైతన్యరావు) ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. అలా ఘాటీలుగా పని చేసిన దేశిరాజు(విక్రమ్ ప్రభు), శీలావతి(అనుష్క).. ఓ కారణంగా ఆ పని వదిలేస్తారు... వేరే పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. శీలావతికి బావ దేశిరాజు అంటే చాలా ఇష్టం. అప్పులు తీర్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కట్ చేస్తే.. కుందుల నాయుడికి తెలియకుండా ఓ గ్యాంగ్ శీలావతి గంజాయిని లిక్విడ్‌గా మార్చి బయటి ప్రాంతాలకు సరఫరా చేస్తుంటుంది. ఈ ముఠాకి లీడర్‌గా దేశిరాజు ఉన్నట్లు కుందుల నాయుడికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఘాటీ పని వదిలిన దేశి రాజు, శీలావతి మళ్లీ గంజాయి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? శీలావతి క్రిమినల్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? దేశిరాజు లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు శీలావతి ఏం చేసింది? ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
క్రిష్ సినిమాల్లో కథ చాలా సింపుల్‌గా, హృదయాలకు హత్తుకునేలా ఉంటుంది. ఒక చిన్న పాయింట్‌ని పట్టుకొని దానికి ఎమోషల్ జోడించి.. ఆలోచింపజేసే డైలాగులతో కథనాన్ని నడిపిస్తుంటాడు. గమ్యం, వేదం, కంచె సినిమాల నేపథ్యం అలానే సాగుతుంది. ఘాటి కథను కూడా అలానే నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సినిమాల్లోలాగా ఎమోషన్‌ని ఇందులో పండించలేకపోయాడు. డైలాగులు కూడా అంత గొప్పగా ఏమి లేవు. కథ నేపథ్యం బాగున్నా..దాన్ని అంతే ఆకర్షనీయంగా తెరపై చూపించడంతో క్రిష్ పూర్తిగా సఫలం కాలేదు.
ఘాటీలు, వారి వృత్తి నేపథ్యాన్ని వివరిస్తూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. హీరో, హీరోయిన్ల ఎంట్రీ చాలా సహజంగా ఉంటుంది. శీలావతి గంజాయి సరఫరా.. రైల్వే స్టేషన్ నుంచి డబ్బులు తీసుకునేక్రమంలో వచ్చే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. ఇక గంజాయి స్మగ్లింగ్ వెనుక హీరోహీరోయిన్లు ఉన్నారనే విషయం తెలిసిన తర్వాత..కథనం మొత్తం ఊహకందేలా సాగుతుంది.
తొలి అర్థభాగం మొత్తం ఎలాంటి ట్విస్టులు, హైమూమెంట్స్ లేకుండా కథనం చాలా సింపుల్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటుంది. అయితే ఆ సీన్‌తో సెకండాఫ్ ఎలా ఉండబోతుందో ఈజీగా ఊహించొచ్చు.
ద్వితియార్థం మొత్తం రివేంజ్ యాక్షన్ డ్రామానే. కథనం మొత్తం అక్కడక్కడే తిరుగుతూ సాగదీతగా అనిపిస్తుంది. ఒకదాని వెనుక మరోకటి యాక్షన్ సీన్లు వస్తూ ఉంటాయి. అయితే గుహలో నాయుడు ముఠాతో చేసే యాక్షన్ సీన్, తలనరికే ఎపిసోడ్ తప్ప..మిగతావేవి ఆకట్టుకోలేవు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు అనుష్క కోసం ఇరికించినట్లుగా అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా సింపుల్‌గా, ఉహకందేలా ఉంటుంది.
బాధితురాలు నేరస్తురాలిగా మారడం.. ఆ తర్వాత తను ఎంచుకున్న మార్గాన్ని వదిలి.. తన వర్గాన్ని మంచి దారిలో నడిపించడం కోసం ప్రయత్నించడం.. ఇదే ఘటి కథ. అయితే తన వర్గాన్ని మంచి దారిలో తీసుకొచ్చేందుకు శీలావతి చేసే పోరాటం ఆసక్తికరంగా మలిచి ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
శీలావతి పాత్రకి అనుష్క న్యాయం చేసింది. యాక్షన్ సన్నివేశాలు ఇరగదీసింది. కానీ ఆ సీన్లను తీర్చిదిద్దిన విధానమే బాగోలేదు. చాలా చోట్ల ఇరికించినట్లుగా, కొన్ని చోట్ల అతిగా అనిపిస్తాయి. ఎమోషనల్ సీన్లను బాగానే నటించింది. కానీ అరుధంతి, బాహుబలి, భాగమతిలో ఉన్న అనుష్క మాత్రం తెరపై కనిపించలేదు. దేశిరాజుగా విక్రమ్ ప్రభు బాగానే నటించాడు. చైతన్యరావు తొలిసారి విలన్‌గా నటించి మెప్పించాడు. అయితే ప్రతిసారి గట్టిగా అరవడం తప్ప.. పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు.
రవీంద్ర విజయ్ విలనిజం కూడా అంతంతమాత్రమే. పోలీసు ఆఫీసర్‌గా జగపతి బాబు అక్కడక్కడ కనిపిస్తాడు. ఆయన పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా మలిచారు. కానీ అది తెరపై వర్కౌట్ కాలేదు. జాన్ విజయ్, రాజు సుందరం, వీటీవీ గణేష్ తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. మనోజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాగర్ సంగీతం ఓకే. పాటలు కథలో భాగంగా వస్తుంటాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్