
‘‘మహావతార్ నరసింహ’ సినిమా మన చరిత్ర. ప్రతి తరానికి మన చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లలకి, ఈ తరం యువతకి మన చరిత్ర తెలియాలి. ఈ ఉద్దేశ్యంతోనే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ను ఆరంభించాం. లైవ్ యాక్షన్ సినిమా కూడా చేయొచ్చు. కానీ ఎవరైనా హీరోగా నటిస్తే, ఆ హీరో ఇమేజ్ ఈ క్యారెక్టర్‌పై పడే అవకాశం ఉంది. అందుకే శ్రీ మహావిష్ణువు కథని చెప్పాలంటే యూనిమేషన్ అనేది ఒక ఉత్తమ మాధ్యమంగా మేం భావించాం. అందుకే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ను యానిమేషన్‌లో చేస్తున్నాం’’ అని దర్శకుడు అశ్విన్ కుమార్ అన్నారు.
శ్రీ విష్ణువు దశావతారాల ఆధారంగా ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ రూపొందుతోంది. ఈ యూనివర్స్ నుంచి తొలి భాగంగా ‘మహావతార్ నరసింహ’ రానుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించిన ‘మహావతార్ నరసింహ’ ఈ నెల 25న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల అవుతోంది.
ఈ సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో అశ్విన్ కుమార్ మాట్లాడుతూ– ‘‘శ్రీ మహావిష్ణువు దశావతారాలను బిగ్ కాన్వాస్‌లో ప్రజెంట్ చేయాలనే ఆలోచనతో ‘మహావతార్ యూనివర్స్’ను మొదలు పెట్టాం. ఈ కథని మేము శాస్త్రాల నుంచే తీసుకున్నాం. ఈ సినిమా చేసేప్పుడు సృజనాత్మకంగా, ఆర్థికంగా, సాంకేతికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. కోవిడ్ పరిస్థితులను ఫేస్ చేశాం. స్వామివారి ఆశీర్వాదం ఈ సినిమాపై ఉంది. వినోదంతో పాటు చరిత్ర, మన సంస్కృతి, ధర్మం... వంటి అంశాలు కూడా ఉన్నాయి. మా నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘మహావతార్ పరశురాం’ ప్రీ ప్రోడక్షన్ దశలో ఉంది’’ అన్నారు. ‘‘మా యూనివర్స్ నుంచి ప్రతి రెండేళ్లకో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు నిర్మాత శిల్ప.