ఈ దసరాకు బరిలో దిగే చిత్రాలివే.. తలపడనున్న చిరు-నాగ్‌

Dasara 2022 Release Chart for Tollywood Movies - Sakshi

ఈ ఏడాది దసరా పండగ బాక్సాఫీస్‌ ఫైట్‌కి    రంగం సిద్ధం అవుతోంది. దసరా బరిలో నిలిచేందుకు హీరోలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రంతో దసరాకు వచ్చేందుకు రెడీ అయ్యారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాకు మోహన్‌రాజా దర్శకుడు. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్‌ ఖాన్, సత్యదేవ్, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దసరాకు ఈ సినిమాను రిలీజ్‌ చేస్తామని చిత్రబృందం పేర్కొంది. కానీ విడుదల తేదీ ప్రకటించలేదు.

ఇక రిలీజ్‌ డేట్‌ను కూడా ఫిక్స్‌ చేసుకుని పండగ బరిలో నిలిచారు హీరో నాగార్జున. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో    రూపొందిన యాక్షన్‌ ఫిల్మ్‌ ‘ది ఘోస్ట్‌’లో       నాగార్జున హీరోగా నటించారు. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 5న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఇందులో సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్‌. నారాయణ్‌ దాస్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మించిన చిత్రం ఇది.

ఇంకోవైపు నిఖిల్‌ కూడా దసరా బరిలో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. నిఖిల్‌ హీరోగా గ్యారీ బీహెచ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘స్పై’. ఈ సినిమాను దసరా సందర్భంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడం, మలయాళ భాషల్లో రిలీజ్‌ చేయనున్నట్లుగా ఇటీవల చిత్రబృందం   ప్రకటించింది. కె. రాజశేఖర్‌ రెడ్డి కథ అందించి, నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.  

మరోవైపు బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అలాగే నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ రెండు చిత్రాలు కూడా దసరాకు రిలీజవుతాయన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రబృందాలు రిలీజ్‌ గురించి స్పష్టత ఇవ్వలేదు. ఇక దసరా పండక్కి ఓ నాలుగు రోజుల ముందే రవితేజ ‘రావణాసుర’ రిలీజ్‌  కానుంది. రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఈ సినిమా సెప్టెంబరు 30న విడుదలవుతుంది. అనుకున్న ప్రకారం రిలీజైతే దసరా  పండక్కి కొన్ని థియేటర్స్‌లో అయినా ‘రావణాసుర’   ఉంటాడు. సేమ్‌        మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ కూడా సెప్టెంబరు 30నే రిలీజ్‌ కానుంది. ఈ సినిమా కూడా దసరా సమయానికి కొన్ని థియేటర్స్‌లో ప్రదర్శనకు ఉండే చాన్సెస్‌ లేకపోలేదు. ఈ చిత్రంలో విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్యా రాయ్‌ ప్రధాన తారలుగా నటించారు.
దసరా పండగ సందర్భంగా మరికొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్‌కి గురి పెడుతున్నాయి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top