సౌత్‌ డైరెక్షన్‌కి సై అంటున్న బాలీవుడ్‌ హీరోలు! | Sakshi
Sakshi News home page

సౌత్‌ డైరెక్షన్‌కి సై అంటున్న బాలీవుడ్‌ హీరోలు!

Published Sun, Apr 14 2024 12:27 AM

Bollywood Actors Mostly Interested In South Indian Directors - Sakshi

బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్‌ వంటి చిత్రాలతో దక్షిణాది సినిమా ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయింది.సౌత్‌ డైరెక్టర్ల క్రేజ్‌ కూడా బాగా పెరిగింది. అందుకే బాలీవుడ్‌ హీరోలు సౌత్‌ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి సై అంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా, తమిళ దర్శకుడు అట్లీ వంటి వారు బాలీవుడ్‌లో సక్సెస్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో దక్షిణాది దర్శకులతో ఉత్తరాది హీరోలు చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. 

సికందర్‌ సిద్ధం 
దాదాపు పదిహేనేళ్ల క్రితమే హిందీ ‘గజిని’ కోసం హిందీ హీరో సల్మాన్‌ ఖాన్, తమిళ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కలిసి పని చేయాల్సింది. అయితే ఆ చిత్రంలో ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటించగా మురుగదాస్‌ దర్శకత్వం వహించారు. ‘గజిని’  బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కానీ మురుగదాస్‌ మాత్రం సల్మాన్‌ ఖాన్‌తో ఎలాగైనా ఓ సినిమా చేయాలని అనుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం సల్మాన్‌ ఖాన్‌కు ఓ కథ చెప్పారు మురుగదాస్‌.

ఈ కథ సల్మాన్‌కు నచ్చలేదట. దీంతో సెట్‌ కాలేదు. కానీ తనతో సినిమా చేయాలనుకుంటున్న మురుగదాస్‌కు మరో నరేషన్‌ ఇచ్చే చాన్స్‌ ఇచ్చారు సల్మాన్‌. ఈసారి సల్మాన్‌కు కథ నచ్చడంతో సినిమా సెట్‌ అయ్యింది. ఈ సినిమాకు ‘సికందర్‌’ టైటిల్‌ పెట్టారు. ఈ చిత్రం షూటింగ్‌ ఈ వేసవిలో ఆరంభం కానుందట. వచ్చే ఏడాది ఈద్‌కి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నారు. అలాగే సల్మాన్‌ ఖాన్‌ ‘ది బుల్‌’ అనే సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. హిందీ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాకు ‘షేర్షా’ వంటి హిట్‌ ఇచ్చిన తమిళ దర్శకుడు విష్ణువర్థన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం.  
 
బాలీవుడ్‌ అపరిచితుడు 
విక్రమ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వం వహించిన ‘అన్నియన్‌’ (‘అపరిచితుడు’) సినిమా బ్లాక్‌బస్టర్‌. ఈ సినిమాను రణ్‌వీర్‌ సింగ్‌తో హిందీలో రీమేక్‌ చేయాలనుకున్నారు శంకర్‌. దాదాపు మూడేళ్ల క్రితం ఈ సినిమా ప్రకటించినా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’, ‘ఇండియన్‌ 3’ సినిమాల పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్, ‘గేమ్‌ చేంజర్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు శంకర్‌. ఈ సినిమాలు విడుదలయ్యాక రణ్‌వీర్‌ సింగ్‌తో శంకర్‌ సినిమా ఉంటుందట. అయితే ‘అన్నియన్‌’ రీమేక్‌ రైట్స్‌ విషయంలో వివాదం నడుస్తున్న నేపథ్యంలో రణ్‌వీర్‌తో ‘అన్నియన్‌’ సినిమానే శంకర్‌ చేస్తారా? లేక కొత్త కథతో సెట్స్‌పైకి వెళ్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది.  

దసరాకు దేవా 
ఈ దసరాకి షాహిద్‌ కపూర్‌ను ‘దేవా’గా థియేటర్స్‌కు తీసుకురావాలనుకుంటున్నారు మలయాళ దర్శకుడు రోషన్‌ ఆండ్రూస్‌. షాహిద్‌ కపూర్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ఈ యాక్షన్‌ ఫిల్మ్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. హిందీలో రోషన్‌ ఆండ్రూస్‌కు ‘దేవా’ తొలి చిత్రం. కాగా షాహిద్‌ కపూర్‌ నెక్ట్స్‌ ఫిల్మ్‌ కూడా దక్షిణాది దర్శకుడుతోనే ఖరారైంది. కన్నడ దర్శకుడు సచిన్‌ రవితో ‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్‌’ ఫిల్మ్‌ కమిటయ్యారు షాహిద్‌. ‘దేవా’ పూర్తి కాగానే ‘అశ్వత్థామ: ది సాగా...’ షూటింగ్‌ ఆరంభం అవుతుందట. 
 
బేబీ జాన్‌ వస్తున్నాడు 
వరుణ్‌ ధావన్‌ను ‘బేబీ జాన్‌’గా మార్చేశారు తమిళ దర్శకుడు కాలిస్‌. వరుణ్‌ ధావన్‌ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్న సినిమా ‘బేబీ జాన్‌’. కాలిస్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లు. ఈ సినిమా మే 31న రిలీజ్  కానుంది.  

 హిట్‌ రీమేక్‌తో... 
తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ హిందీలో ‘సర్ఫిరా’గా రీమేక్‌ అవుతుండగా, అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్నారు. మాతృతకు దర్శకత్వం వహించిన సుధ కొంగరయే ‘సర్ఫిరా’కు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ‘సూరరై పోట్రు’లో నటించిన సూర్య ‘సర్ఫిరా’కు ఓ నిర్మాతగా ఉంటూ, గెస్ట్‌ రోల్‌ చేయడం విశేషం. ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది.ఇంకా తెలుగు దర్శకులు తేజ, గోపీచంద్‌ మలినేని, ప్రశాంత్‌ వర్మ, తమిళ దర్శకుడు పా. రంజిత్‌ తదితరులు చెప్పిన కథలను హిందీ హీరోలు విన్నారని సమాచారం.

Advertisement
 
Advertisement