Biggest Controversies Of 2022: ఈ ఏడాది బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ బ్లాస్ట్‌లివే..!

Biggest controversies of 2022 In Bollywood Film Industry - Sakshi

ప్రతిరంగంలో వివాదాలు, గొడవలు సర్వ సాధారణం. కానీ సినీ పరిశ్రమలో అవి మరింత ఎక్కువ. బాలీవుడ్‌లో అయితే ఎప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఈ ఏడాది బాలీవుడ్ చిత్రాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. ఏకంగా బాయ్‌కాట్‌ బాలీవుడ్ అనే నినాదం ఊపందుకునేలా వివాదాలు తలెత్తాయి. 2022లో వివాదాలకు దారితీసిన ఆ చిత్రాలు, సంఘటనలేవో ఓ లుక్కేద్దాం. 

ఓ మ్యాగజైన్ కవర్‌పై రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటో,  సుస్మితా సేన్‌తో లలిత్ మోడీ ఫోటో  2022లో అతిపెద్ద వివాదాలుగా నిలిచాయి. మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు రావడం హాట్‌ టాపిక్‌గా మారింది. అలాదే అజయ్ దేవగన్,  కిచ్చా సుదీప్ హిందీ భాషపై వివాదం ఇలా చాలానే ఉన్నాయి. 

రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్: బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్ సింగ్ అంతర్జాతీయ మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫోటోకు పోజులివ్వడంతో తీవ్ర దుమారం రేగింది. దీనిపై పోలీసు ఫిర్యాదులు కూడా చేశారు. కొంతమంది బాలీవుడ్ నటులు విద్యాబాలన్, మసాబా గుప్తా, నకుల్ మెహతా, చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ దీన్ని ప్రశంసించగా.. ముంబైకి చెందిన ఎన్‌జిఓ 'మహిళల మనోభావాలను దెబ్బతీయడం'పై అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరింది. 

సుస్మితా సేన్‌తో లలిత్ మోదీ: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ జూలైలో అనుకోని రీతిలో సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు.  అతను సుస్మితా సేన్‌తో కలిసి మాల్దీవుల్లో ఉన్నరొమాంటిక్ ఫోటోలతో వార్తల్లో నిలిచారు. 2018లో ఆయన భార్య మరణించిన తర్వాత  కొత్త జీవితంలో 'బెటర్ హాఫ్' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు .  "పెళ్లి చేసుకోలేదు - కేవలం ఒకరితో ఒకరు డేటింగ్. అది కూడా ఏదో ఒక రోజు జరుగుతుంది.” అంటూ లలిత్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్‌ను సుస్మితతో ఉన్న ఫోటోను పెట్టాడు.  ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన వ్యక్తులలో ఇద్దరూ కూడా ఉన్నారు.

మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్: సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా బాలీవుడ్ నటి  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రావడం సంచలనంగా మారింది. దీంతో జాక్వెలిన్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆమె క్రమం తప్పకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరవుతూనే ఉంది. ఈడీ ఆరోపణల ప్రకారం ఆమెతో పాటు మరో నటి నోరా ఫతేహి.. సుఖేశ్ నుంచి కోట్ల విలువైన బహుమతులు అందుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న నోరా దిల్లీ కోర్టులో జాక్వెలిన్‌పై పరువు నష్టం దావా వేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. 

బిగ్ బాస్ 16లో సాజిద్ ఖాన్ ఎంట్రీ దుమారం: లైంగిక వేధింపుల జాబితాలో దర్శకుడు సాజిద్‌ పేరు ముందుటుంది.  మీటూ ఉద్యమంలో ఆయనపై పలువురు నటీమణులు ఆరోపణలు గుప్పించారు.  అలాంటి వ్యక్తిని బిగ్‌ బాస్‌ షో పోటీదారులలో ఒకడిగా ఉండడాన్ని పలువురు తప్పుబట్టారు. అతనిపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఈ విషయాలను ఛానెల్ పట్టించుకోలేదు. 

అజయ్ దేవగణ్, కిచ్చా సుదీప్ మధ్య గొడవ: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ఏప్రిల్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో "హిందీ జాతీయ భాష కాదు. అందుకే వారు పాన్-ఇండియా సినిమాలు చేస్తున్నారు" అంటూ చేసిన వాఖ్యలు వివాదానికి దారితీశాయి. కిచ్చా సుదీప్ ప్రకటనపై హీరో అజయ్ దేవగణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.  ‘హిందీ మన జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారు?’ అని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. అయితే సుదీప్ దీనిపై స్పందిస్తూ కన్నడలో టైప్ చేసి ఉంటే అతని స్పందన అర్థం అయ్యేదా అని అజయ్‌ని అడిగాడు. “మేము కూడా భారతదేశానికి చెందినవారమే కదా సార్” అని సుదీప్ ట్వీట్ చేశాడు. 

లాల్ సింగ్ చద్దా వివాదం: అమీర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చద్దా ఈ ఏడాది చాలా ఎదురుచూసిన చిత్రాల్లో ఒకటి. అయితే చాలామంది సినిమాకు సానుకూలంగా ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన కలెక్షన్లను రాబట్టలేకపోయింది.  ఈ మూవీ విడుదల సమయంలో ట్విట్టర్‌లో బాయ్‌కాట్ లాల్‌సింగ్‌ చద్దా అంటూ అప‍్పట్లో ట్రెండ్ అయింది. 

పఠాన్ మూవీ బేషరమ్ రాంగ్: ఈ ఏడాది  బాలీవుడ్‌ బాద్‌షా నటించిన చిత్రం పఠాన్. ఈ సినిమాలోని బేషరమ్ రంగ్ అనే సాంగ్ తీవ్ర వివాదానికి దారితీసింది. దీపికా పదుకొనే నటించిన ఈ చిత్రంలో బేషరమ్ రంగ్ పాటకు ధరించిన దుస్తులపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.  దీనిపై కొంతమంది రాజకీయ నాయకులు దీపిక ధరించిన కుంకుమ రంగు బికినీపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని పలువురు డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మండిపడ్డారు. షారూక్‌ను సజీవ దహనం చేస్తానని అయోధ్యలోని ఆలయ ప్రధాన పూజారి హెచ్చరించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top