
బిగ్‌బాస్ 9వ షోలో దీపావళి ఎపిసోడ్ థౌజండ్‌వాలా పటాకాలా పేలింది. అటు గేమ్స్, ఇటు ఫ్యామిలీ నుంచి వీడియో సందేశాలు, జటాధర టీమ్ అట్రాక్షన్, స్పెషల్ డ్యాన్స్.. ఎలిమినేషన్.. ఎమోషన్స్.. ఇలా అన్నీ పండాయి. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 19వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
పేరడీ సాంగ్స్
నాగార్జున (Nagarjuna Akkineni) హౌస్‌మేట్స్‌కు కొత్త బట్టలు కానుకగా ఇచ్చాడు. అవి చూసి కంటెస్టెంట్లు మురిసిపోయారు. తర్వాత గేమ్స్ ఆడిస్తూనే మధ్యమధ్యలో వీడియో సందేశాలు చూపించారు. సింగర్ సాకేత్ వచ్చి హౌస్‌మేట్స్‌పై పేరడీ సాంగ్స్ పాడాడు. హైపర్ ఆది.. కంటెస్టెంట్లపై పంచులు పేలుస్తూనే చాలా హింట్లు ఇచ్చేశాడు. ఎవరిపైనా ఆధాపడకూడదని తనూజ, రీతూకు సలహా ఇచ్చాడు. నేను స్ట్రాంగ్, ఏడ్చే కంటెస్టెంట్ కాదన్నారు. ఇప్పుడేమో ఏడుస్తూనే ఉన్నారు.. అది మార్చుకోమని దివ్యకు సూచించాడు.

హైపర్ ఆది హింట్స్
మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని రాము రాథోడ్‌కు, కంటెస్టెంట్లు ఆరువారాల్లో ఇచ్చిన కంటెంట్ అంతా ఒక్కవారంలోనే ఇచ్చారని మాధురితో అన్నాడు. నెగెటివ్ మైండ్‌సెట్ తీసేసి పాజిటివ్‌గా ఆలోచించమని రమ్యకు.. ఆట మార్చమని నిఖిల్‌కు సలహా ఇచ్చాడు. పొటెన్షియల్, ఇండివిడ్యువల్, ఎమోషనల్.. ఈ మూడు కారణాలు చెప్పి తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేశావు.. కానీ ఆ మూడు తప్పులు నువ్వే చేస్తున్నావని ఆయేషాకు చురకలంటించాడు. సాయి శ్రీనివాస్.. ఏజెంట్‌లా ప్రవర్తిస్తున్నాడని.. ఇతరులపై చాడీలు చెప్తున్నట్లుందని అభిప్రాయపడ్డాడు.
భరణి ఎలిమినేట్
ఇక నాగార్జున అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో రాము, భరణి (Bharani Shankar) మాత్రమే మిగిలారు. వీరిలో ఎవరికైనా పవరాస్త్ర వాడాలనుకుంటున్నావా? అని నాగార్జున ఇమ్మాన్యుయేల్‌ను అడిగాడు. అందుకతడు ఆలోచించి.. ఆరువారాల ఆట ప్రకారం రాము రాథోడ్‌ను సేవ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో భరణి ఎలిమినేట్ అయ్యాడు. ప్రేక్షకుల ఓట్ల ద్వారా కూడా భరణి ఎలిమినేట్ అయినట్లు నాగ్ తెలిపాడు. నాన్న వెళ్లిపోతుంటే తనూజ, దివ్య వెక్కెక్కి ఏడ్చేశారు.
నావల్ల నీ ఒక్కడికే అన్యాయం
స్టేజీపైకి వచ్చిన భరణి.. తనూజతో నీకు ఒకటే చెప్తున్నా.. ఎవర్నీ నమ్మకు, ఎవరిపైనా ఆధారపడకు. నీకు తోచినంత ఆడు, ఏడవకు అని బుజ్జగించాడు. అప్పటికీ తనూజ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది. దివ్యతో.. నువ్వు నా స్వీట్‌హార్ట్.. నిన్ను చూశాక నాకు ఒక చెల్లి ఉంటే బాగుండనిపించింది. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి అన్నాడు. ఆ మాటతో దివ్య.. నా కుటుంబం తర్వాత ఎవరితోనూ రిలేషన్ కలుపుకోలేదు. హౌస్‌లో మీకోసం తప్ప దేనికోసమూ ఏడవలేదు. మీరెప్పటికీ నా అన్నయ్యే అంటూ ఏడ్చేసింది. ఇక చివరగా భరణి.. నా వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందంటే పవన్‌కు ఒక్కడికే.. నీకు చాలాసార్లు సారీ చెప్పాను. నువ్వు కప్పు కొట్టి బయటకు వచ్చాక నా మాటపై నిలబడతాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు.