
సినిమాలకన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమసైంది సంజనా గల్రాని (Sanjana Galrani). బుజ్జిగాడు మూవీతో టాలీవుడ్‌లో పరిచయమైంది. తెలుగులో కన్నా కన్నడలో మంచి స్టార్‌డమ్ సంపాదించింది. 2020లో రహస్యంగా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. ఆమెకు ఇద్దరు పిల్లలు సంతానం. అంతా బాగున్న సమయంలో డ్రగ్స్ కేసుతో తన కెరీర్ కుప్పకూలింది. డ్రగ్స్ కుంభకోణంలో జైలుకు కూడా వెళ్లొచ్చింది. తాజాగా ఆమె తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్‌లో అడుగు పెట్టింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నా పేరు అర్చన. ఏడో తరగతి చదువుతున్న సమయంలో మోడలింగ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. జాన్ ఇబ్రహీంతో ఓ యాడ్ చేశాను. అప్పుడు పూరీ జగన్నాథ్ నన్ను చూసి బుజ్జిగాడు సినిమాలో ఆఫర్ ఇచ్చారు. ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ. అయినా నిలదొక్కుకుని, కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నాను. ఒకరోజు సడన్‌గా ఓ కేసులో నా పేరు ఇరికించారు. విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు. నాకు చావెందుకు రాలేదు? అని బాధపడ్డాను. ఆ రోజు గురించి తలుచుకుంటేనే బాధేస్తోంది.
ఒక్కో మీడియా ఛానల్ ఒక్కోలాగా చెప్పింది. అక్కడేం లేకపోయినా ఏదేదో చెప్పి నా జీవితం సర్వనాశనం చేశారు. అది తప్పుడు కేసు అని హైకోర్టు నాకు క్లీన్‌చిట్ ఇచ్చింది. కానీ, అదెవరికీ కనిపించలేదు. నేను అలాంటి అమ్మాయిని కాదు అని నిరూపించడానికే వచ్చాను. మీ అందరి మనసులో స్థానం సంపాదించుకోవాలనే బిగ్‌బాస్‌కు వచ్చాను అని చెప్తూ భావోద్వేగానికి లోనైంది.