
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. సోదరి సమీక్షా పెడ్నేకర్ (Samiksha Pednekar)తో కలిసి బ్యాక్‌బే అనే బ్రాండ్ స్థాపించి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారింది. ప్రజలకు సురక్షితమైన మంచినీళ్లు అందివ్వడమే తన లక్ష్యం అని చెప్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం రెండేళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిపింది. భూమి ఇంకా మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్‌లో సొంతంగా ఓ ప్లాంట్ స్థాపించాం. అందుకు మాకెంతో గర్వంగా ఉంది.
ప్లాస్టిక్ వాడకుండా..
అక్కడ మహిళలే పని చేస్తున్నారు. మాది ప్రీమియం వాటర్ బ్రాండ్ కంపెనీ. మూడు రకాల ఫ్లేవర్స్‌తో లభ్యం అవుతుంది. ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్‌ను వాడలేదు. బాటిల్ క్యాప్ భూమిలో కలిసిపోయేదిగా తయారు చేశాం. ఇలా పర్యావరణ స్పృహతో పనిచేస్తున్న వాటర్ కంపెనీ ఏదైనా ఉందా అంటే అది మాది మాత్రమే! అరలీటర్ వాటర్ బాటిల్ రూ.150, రూ.750 ml వాటర్ బాటిల్ ధర రూ.200గా నిర్ణయించాం.

రూ.200కే మంచినీరు
అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే రూ.200కే హిమాలయ వాటర్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజుల్లో అందరూ ఎనర్జీ డ్రింక్స్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యమైనది స్వచ్ఛమైన నీళ్లు. మా బాటిల్‌లో సహజసిద్ధమైన మినరల్స్, ఎలెక్టోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. వచ్చే నాలుగేళ్లలో రూ.100 కోట్ల మార్కెట్ అందుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం. 15 ఏళ్లలో ప్రతి ఇంట్లో మా బాటిల్ కనిపించాలని ఆశపడుతున్నాం.
పెట్టుబడి ఎలా?
17 ఏళ్ల వయసులో నా సంపాదన మొదలైంది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌లో పనిచేసినప్పుడు నాకు ఇచ్చిన తొలి పారితోషికం రూ.7 వేలు. అప్పటినుంచే నాకు పొదుపు చేయడం అలవాటు. అలా నా సంపాదనలో కొంతభాగాన్ని కూడబెడుతూ వచ్చాను. ఆ డబ్బుతోనే బ్యాక్‌బే ప్రారంభించగలిగాం అని చెప్పుకొచ్చింది. భూమి పెడ్నేకర్ చివరగా మేరే హజ్బెండ్ కి బివి సినిమాలో నటించింది.
చదవండి: ఆ సినిమాకు ఫహద్ ఫాజిల్ రెమ్యునరేషన్ రూ.1 లక్ష మాత్రమే!