
సాధారణంగా వీకెండ్‌లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో గురువారం అందుబాటులోకి వస్తుంటాయి. కానీ కొన్నిసార్లు వారం మధ్యలోనే ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు హారర్ కామెడీ మూవీ సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతోంది. లెక్క ప్రకారం ఈ వారాంతంలోనే డిజిటల్ రిలీజ్ ఉంది. కానీ ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?
పలు సినిమాల్లో కమెడియన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ లీడ్ రోల్ చేసిన మూవీ 'బకాసుర రెస్టారెంట్'. గత నెల 8న థియేటర్లలో రిలీజైంది. ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. దీన్ని సెప్టెంబరు 12న సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. క్షుద్ర పూజలతో నిద్రలేచే ఆత్మ వల్ల ఇబ్బందులు, దాంతో వచ్చే భయం తదితర అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారు.
(ఇదీ చదవండి: నటి సుధ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు లీక్.. పోలీసులకు ఫిర్యాదు!)
'బకాసుర రెస్టారెంట్' విషయానికొస్తే.. పరమేశ్వర్ (ప్రవీణ్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఉద్యోగం కంటే వ్యాపారం చేయడంపై ఆసక్తి. రెస్టారెంట్ పెట్టాలనుకుంటాడు. దాని కోసం డబ్బులు సంపాదించేందుకు యూట్యూబ్ ఛానెల్ పెడతాడు. దెయ్యంపై చేసిన తొలి వీడియో వైరల్ కావడంతో రెండో వీడియో కోసం పాత బంగ్లాకు స్నేహితులతో కలిసి వెళ్తాడు. అక్కడ కనిపించిన పుస్తకంతో క్షుద్రపూజ చేస్తారు. దీంతో బక్క సూరి (వైవా హర్ష) అనే ఆత్మ బయటకొస్తుంది.
బక్క సూరి ఆత్మతో వాళ్లంతా ఆడే ప్రయత్నం చేయగా.. పరమేశ్వర్ స్నేహితుడి శరీరంలోకి ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. దాని ఆకలికి హద్దుండదు. ఆ ఆత్మని బయటకు పంపేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? అసలు ఆత్మ నేపథ్యమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)