
వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రవీణ్. ఆయన తొలిసారిగా హీరోగా నటిస్తున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్'. ఎస్‌జే శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటించాడు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ముఖ్యపాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
పరమేశ్వర్(ప్రవీణ్) ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటూ ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఆ జాబ్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ రెస్టారెంట్ పెట్టాలనేది ఆయన కోరిక. ఓ సారి తన కోరికనే స్నేహితులతో పంచుకోగ.. డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లే మొదటి వీడియో బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఓ హోస్ట్ హౌస్‌కి వెళ్తారు. అక్కడ వీరికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అందులో రాసి ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా.. నిమ్మకాయలోకి 200 ఏళ్ల క్రితం నాటి ఆత్మ వస్తుంది. ఆ ఆత్మకు ఆకలి ఎక్కువ. ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తిసేస్తుంది.
ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మను కట్టడి చేసేందుకు ప్రయత్నించగా.. పరమేశ్వర్ రూమ్‌లోకి వచ్చిన అంజిబాబు(ఫణి) శరీరంలోకి వెళ్తుంది. అంజిబాబు శరీరాన్ని ఆవహించిన ఆత్మను పొగొట్టేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? బక్క సూరి(వైవా హర్ష) ఎవరు? అతనికి ఉన్న రోగం ఏంటి? అంజిబాబులో ఉన్న ఆత్మ బక్క సూరిది అని తెలిసిన తర్వాత పరమేశ్వర్(ప్రవీణ్) గ్యాంగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది. చివరకు అంజిబాబు శరీరం నుంచి ఆ ఆత్మ బయటకు వెళ్లిందా లేదా? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఇదొక కామెడీ హారర్ చిత్రం. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. అయితే ఇందులో దెయ్యాన్ని తిండిబోతుగా చూపించడం డిఫరెంట్గా అనిపిస్తుంది. సాధారణగా కామెడీ హారర్ చిత్రాల్లో ఒక ఆత్మ ఉండడం..దానికో ఎమోషల్ ప్లాష్‌బ్యాక్.. క్లైమాక్స్లో దాని కోరిక నెరవేర్చడం.. ఇదే కథ. ఈ చిత్రంలో కూడా అవన్నీ ఉంటాయి.
తాంత్రిక పూజకు సంబంధించిన సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెంటనే హైదరాబాద్‌కి షిఫ్ట్ అవుతుంది. హీరో పరిచయ సన్నివేశంతోనే అసలు కథ ప్రారంభం అవుతుంది. డబ్బుల కోసం యూట్యూబ్ వీడియోలు చేయాలనుకోవడం..గోస్ట్‌హౌస్‌కి వెళ్లడం..అక్కడ జరిగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అయితే ప్రతిసారి ఆ తరహా కామెడీనే చూపించడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది.
అంజిబాబు పాత్ర ఎంట్రీ, అతనిలోకి బకాసుర ఆత్మ వెళ్లిన తర్వాత మళ్లీ కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ బాగా ప్లాన్ చేశారు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్. కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. బక్క సూరి ప్లాష్‌బ్యాక్ సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతాయి. ఆత్మను అడ్డుపెట్టుకొని డబ్బులు సంపాదించే సన్నివేశాలు అలరిస్తాయి. ప్రీక్లైమాక్స్‌లో వచ్చే అల్లరి దెయ్యాలు కామెడీ ట్రాక్ వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్‌ని కాస్త ఎమోషనల్‌గా మలిచే ప్రయత్నం చేశారు. రొటీన్ కామెడీ హారర్ కథే అయినా... తిండిబోతు దెయ్యం మాత్రం కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
ఇన్నాళ్లు కమెడియన్‌గా అలరించిన ప్రవీణ్.. ఇందులో హీరోగా నటించి సినిమా భారం మొత్తం తన భుజాన వేసుకున్నాడు. తన బలమైన కామెడీ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్లలోనూ చక్కగా నటించాడు. వైవా హర్ష తెరపై కనిపించేది కాసేపే అయినా ఉన్నంతలో బాగానే యాక్ట్ చేశాడు. అంజిబాబు పాత్రకి ఫణి న్యాయం చేశాడు. ప్రవీణ్ స్నేహితులుగా నటించిన కుర్రాళ్ల కామెడీ టైమింగ్ బాగుంది. చాలా రోజుల తర్వాత కృష్ణ భగవాన్ వెండితెరపై మెరిశాడు. ఓ హోటల్ యజమానిగా కనిపించిన ఆయన.. తనదైన పంచ్ డైలాగులతో ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ అయ్యంగార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు, నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.