
– తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్
‘‘నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌గారు ఇటీవల ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ‘ఆర్ట్ మాఫియా’ అంటూ ఆర్ట్ డైరెక్టర్ల గురించి మాట్లాడటం బాధాకరం. ఆ వ్యాఖ్యల్ని ఆయన ఉపసంహరించుకోవాలి’’ అని ‘తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్’ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షుడు రమణ వంక, ప్రధాన కార్యదర్శి కేఎం రాజీవ్ నాయర్, కోశాధికారి ఎం. తిరుమల బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘సినిమాలో కథను అనుసరించి దర్శకుల ఊహను దృశ్యరూపంలో చూపించడంలో కళా దర్శకులు చాలా కీలకం. సృష్టికి ప్రతిసృష్టిని దృశ్యరూపంలో చూపించే మేథా సంపత్తి కలిగిన అతిముఖ్యమైన విభాగమే కళాదర్శకత్వ విభాగం. అంతటి విలువైన, ప్రాముఖ్యత కలిగిన మా విభాగంపై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌గారు ‘ఆర్ట్ మాఫియా’ అంటూ చేసిన వ్యాఖ్యలను మేము(కళా దర్శకత్వ, ఆర్ట్ డైరెక్టర్స్) ఖండిస్తున్నాం.
ఇటీవల కాలంలో ఆయన పలు సినిమాలు నిర్మిస్తూ ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పించారు, కల్పిస్తున్నారు.. ఇందుకు కార్మికుల పక్షాన కృతజ్ఞతలు. అయితే సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. సెట్స్‌లోనూ మార్పులు చేయాల్సి వస్తుంది. నిర్మాతల అనుమతితోనే మార్పులు చేస్తాం. అలాంటప్పుడు ఖర్చులు పెరుగుతాయి. కొన్నిసార్లు తగ్గుతాయి.
ఈ విషయంపై ఏ నిర్మాతకైనా అవగాహన, ఆలోచన ఉంటుంది. మీడియాలో మా గురించి తప్పుగా మాట్లాడే ఆ నిర్మాత తన సినిమా విషయంలో జరిగిన అంశాన్ని ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. అలాగే పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్–ఆర్ట్ డైరెక్టర్‌పై ‘తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్’ ద్వారా వివరణ తీసుకోవచ్చు. ఇలాంటివి చేయకుండా మాపై నిందలు వేయడం సరికాదు’’ అని తెలిపారు.