
ఏఆర్ మురుగదాస్.. ఈ పేరు చెప్పగానే గజిని, తుపాకీ, కత్తి లాంటి హిట్ సినిమాలు గుర్తొస్తాయి. తెలుగులో చిరంజీవి, మహేశ్ బాబుతో స్టాలిన్, స్పైడర్ తదితర చిత్రాలు చేసిన అనుభవముంది. అప్పట్లో స్టార్ డైరెక్టర్‌గా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు గానీ గత కొన్నాళ్లలో మాత్రం తీసినవన్నీ ఘోరమైన ఫ్లాప్స్. ఈ ఏడాది బాలీవుడ్‌లో 'సికిందర్' తీస్తే భారీ డిజాస్టర్ అయింది. ఈ మూవీ వచ్చి చాలా నెలలే అయిపోయింది. కానీ ఇప్పుడు మరోసారి దాని గురించి మాట్లాడాడు. సల్మాన్ ఖాన్ వల్ల ఆ సినిమా రిజల్ట్ అలా జరిగింది అన్నట్లు మురుగదాస్ పరోక్షంగా చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: మహేశ్ బాబు కూతురికి తప్పని 'ఫేక్' కష్టాలు)
'ఓ స్టార్ హీరోతో సినిమా చేయడం అంత సులభం కాదు. పగలు తీయాల్సిన సన్నివేశాలు ఉంటాయి. కానీ అతడు మాత్రం రాత్రి 8 గంటల తర్వాతే సెట్స్‌కి వస్తాడు. కాబట్టి మేం రాత్రి మాత్రమే చిత్రీకరణ చేయాల్సి వచ్చేది. మేం తెల్లవారుజామున షూటింగ్ చేయడానికి అలవాటు పడ్డాం కానీ అక్కడ పరిస్థితులు అలా ఉండవు. ఓ సీన్‌లో నలుగురు పిల్లలుంటే.. వాళ్లు స్కూల్ నుంచి తిరిగొస్తున్న సీన్ తీయాలన్నా సరే వేకువజామున 2 గంటలకు షూటింగ్ చేయాల్సి వచ్చేది. ఆ టైంకి ఆ పిల్లలు నిద్రపోతారు' అని మురుగదాస్ చెప్పుకొచ్చాడు.
అలానే 'సికిందర్' షూటింగ్ టైంలో చాలామంది జోక్యం చేసుకోవడం కూడా సినిమా వైఫల్యానికి కారణమని మురుగదాస్ చెప్పుకొచ్చాడు. గతంలో విజయ్, సూర్య, ఆమిర్ ఖాన్, చిరంజీవి, మహేశ్ బాబు.. ఇలా చాలామంది స్టార్లతో మురుగదాస్ పనిచేశాడు. కానీ ఎవరిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. మరి ఇప్పుడు సల్మాన్ ఖాన్‌పై మాత్రమే ఎందుకు కామెంట్స్ చేస్తున్నాడా అనేది సస్పెన్స్. మురుగదాస్ తీసిన 'మదరాసి'.. సెప్టెంబరు 5న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై కూడా ఎవరికీ పెద్దగా నమ్మకాల్లేవ్. మరి ఈ మూవీతో హిట్ కొట్టి మురుగదాస్ బౌన్స్ బ్యాక్ అవుతాడా? లేదా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: ప్రభాస్.. రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు: డిస్ట్రిబ్యూటర్)