
అనుష్క శెట్టి.. తెలుగు ప్రేక్షకులకే కాదు, సౌత్ ఇండియన్ ఆడియన్స్‌కు కూడా ఫేవరెట్ హీరోయిన్. చాలాకాలం గ్యాప్ తర్వాత ‘ఘాటీ’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఆమె గురించి కొన్ని విశేషాలు..
యోగా టీచర్ నుంచి..
అనుష్క శెట్టి (Anushka Shetty) నవంబర్ 7న పుట్టింది. అదే రోజున మహానటుడు కమల్ హాసన్ పుట్టిన రోజు. అందుకే కొందరు ‘నటనకి పుట్టిన రోజు’ అని కామెంట్ చేస్తుంటారు. నటన మీద ఆసక్తి లేకపోయినా, అనుకోకుండా హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ముంబైలో భరత్ ఠాకూర్ వద్ద యోగా టీచర్‌గా పనిచేస్తుండగా, బాలీవుడ్ డైరెక్టర్ ఇ.నివాస్ ద్వారా తెలుగు దర్శక నిర్మాత పూరీ జగన్నాథ్ పరిచయమయ్యారు.
అరుంధతితో స్టార్‌డమ్
రామ్ చరణ్ మొదటి సినిమా ‘చిరుత’.. మొదట పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్‌తో ‘సాగర్’ పేరుతో మెహర్ రమేష్ డైరెక్షన్‌లో తీద్దామనుకున్నారు. ఆ సినిమా కోసం అనుష్కను మొదట ఫొటోషూట్ చేశారు. కానీ అనుకున్నవేవీ జరగలేదు. ‘సూపర్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ‘అరుంధతి’తో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ మొదలైన సినిమాలు ఆమె స్టార్‌డమ్‌ను పెంచాయి.
అర్జున్‌రెడ్డిలో..
కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన కుటుంబం అనుష్క శెట్టిది. అందుకే విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’లో హీరోయిన్ మంగళూరు ఏరియాకు చెందిన అమ్మాయి అని చూపించగానే, అనుష్క బాగా కనెక్ట్ అయి, ఆ విషయం హైలైట్ చేస్తూ ట్వీట్ కూడా చేసింది. క్రిష్ డైరెక్షన్‌లో గతంలో ‘వేదం’ సినిమా చేసిన అనుష్క శెట్టి ఇప్పుడు ‘ఘాటీ’ మూవీ చేస్తోంది.
హారర్ సినిమాలంటే భయం
మలయాళంలో ఫస్ట్ టైమ్ యాక్ట్ చేస్తోంది. ఆ సినిమా పేరు ‘ఘటన’. కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమా ఎంతటి సెన్సేషనల్ హిట్టో అందరికీ తెలిసిందే. ఆ సినిమా సీక్వెల్‌కి అనుష్కని హీరోయిన్‌గా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సెలెక్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదెంత నిజమో చూడాలి. ‘అరుంధతి’, ‘పంచాక్షరి’, ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ లాంటి హారర్, క్రైమ్ థ్రిల్లర్స్‌లో యాక్ట్ చేసిన అనుష్కకి పర్సనల్‌గా హారర్ సినిమాలు చూడటం అంటే మాత్రం చాలా భయం!
వెంటే ఉండాలి
అనుష్క షిర్డీ సాయిబాబా భక్తురాలు. తన మేకప్ రూమ్‌లో, కార్వాన్‌లో.. తను వెళ్ళిన ప్రతి చోటకి సాయిబాబా విగ్రహం చిన్నదైనా తీసుకుని వెళ్తుంది. కొంతకాలం వరకు అనుష్కకి, సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఒకే మేకప్ వుమన్ పని చేసేవారు.