
ఆమె ముందుంది పెద్ద సవాల్...యాక్షన్ డైరెక్టర్
జర్మనీలో జన్మించిన వియత్నామీస్ మూలాలున్న యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ న్గుయెన్(Andy Long Nguyen), ఆయన కుంగ్ ఫూ వారియర్ (2017) యాక్సిడెంట్ మ్యాన్: హిట్‌మ్యాన్ హాలిడే (2022) వంటి హాలీవుడ్ చిత్రాల నుంచి శివాయ్ (2016), సనక్ (2021) వంటి బాలీవుడ్ చిత్రాల దాకా పనిచేశాడు. ఇటీవల తెలుగు పౌరాణిక సైన్స్ ఫిక్షన్ కల్కి 2898 ఎడి కి పని చేయడం ద్వారా స్టంట్స్ కొరియోగ్రఫీలో అంతర్జాతీయ కెరీర్‌ను అందుకున్న టాప్ యాక్షన్ డైరెక్టర్‌గా నిలిచారు.ఈ నేపధ్యంలో తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు.
‘‘జర్మనీ లో డబ్ చేయబడిన భారతీయ చిత్రాలను చూస్తున్న టీనేజర్‌గా, అమితాబ్ బచ్చన్‌ను డైరెక్ట్ చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఆయన వయస్సు గురించి తొలుత నాకు ఆందోళన ఉండేది అయితే షూటింగ్ సమయంలో ఆయన తన వయస్సులో సగం మంది కంటే చురుకుగా కదిలారు’’ అంటూ ఆయన చెప్పాడు.
‘‘ దేవుళ్ళు, అమరులు, దిగ్గజాలు, రోబోలు అంతరిక్ష నౌకలతో నా మొదటి పౌరాణిక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం అది. సవాలుగాగానూ, అద్భుతంగా కూడా ఉంది, ’’అని ఆయన గుర్తుచేసుకున్నాడు. నాగ్ అశ్విన్ తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ ‘స్టోరీబోర్డులు లేదా రిఫరెన్స్‌లపై ఆధారపడకుండా నాగ్ తన టీమ్‌ని నడిపించే విధానం సూపర్. తక్కువ సూచనలతోనే అందరి దృష్టి తన వైపు మళ్ళించగలిగాడు. అది చాలా ఆకట్టుకుంది.’’ అని చెప్పాడు ఆండీ.
తెలుగు సినిమాలో లాంగ్ తదుపరి అతి పెద్ద ప్రాజెక్ట్ మైసా( Mysaa), ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna) నటిస్తోంది. అది కూడా తొలిసారిగా ఆమె ఒక యాక్షన్ క్వీన్‌గా మారనుంది. ఈ విషయంపై ఆండీ మాట్లాడుతూ ‘‘రష్మికతో అంతకు ముందుగానే పనిచేయాల్సి ఉండింది. ఆమెతో పనిచేయడం పట్ల నేను సంతోషంగా అంతకు మించి ఆసక్తిగా ఉన్నాను. రష్మిక చాలా చురుకైన యువతి.. అయితే నేను డైరెక్ట్ చేయబోయే పాత్ర కోసం తనను తాను మరింత సాన బెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా కఠినమైన శారీరక స్టంట్ శిక్షణ పొందవలసి ఉంటుంది, ఇది ఆమెకు పూర్తిగా కొత్త అనుభవం సరికొత్త సవాల్ కూడా ’’అని అంటున్నాడాయన.

ఆండీకి, ఫైట్ కొరియోగ్రఫీ అంటే శారీరక కదలికలు గురించి మాత్రమే కాదు – ఇది కథ చెప్పడం కూడా. ‘కథకు ఉపయోగపడే విధంగా పాత్రను మరొక స్థాయికి తీసుకెళ్లే విధంగా యాక్షన్‌ను రూపొందించడాన్ని ఇష్టపడతాను. ఏ నైపుణ్యాలు అర్ధవంతంగా ఉంటాయో, వారు ఎందుకు పోరాటంలోకి ప్రవేశిస్తారో వారి లక్ష్యం ఏమిటో తెలుసుకోవడం కోసం స్క్రిప్ట్ , పాత్రలను అధ్యయనం చేయడం చాలా ముఖ్యం’’ అని వివరించాడు. అతను యాక్షన్ ను కథనం నుంచి∙విడదీయలేని భాగంగా వర్ణించాడు.
‘యాక్షన్ అనేది సంభాషణ కు మరొక రూపం అది ప్రతి ఇతర సన్నివేశంతో సంపూర్ణంగా మిళితం కావాలి. పోరాటం వెనుక ఉన్న భావోద్వేగం కొరియోగ్రఫీ లాగే ముఖ్యమైనది అంటున్న ఆయన ‘హైదరాబాద్ భారతదేశంలో తన మొదటి గమ్యస్థానంగా తనపై శాశ్వత ముద్ర వేసిందనీ, ఇక్కడి వంటకాలు మరపురానివని చెప్పాడు, గోల్కొండ కోట యాక్షన్–సాహసం కోసం వేచి ఉన్న రెడీమేడ్ మూవీ సెట్ లాగా తనకు అనిపిస్తుంది.‘ అంటూ వర్ణించాడు.