
సినిమా ఛాన్సులపై పవన్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
చలనచిత్ర రంగంలో తారలుగా రాణించాలని చాలా మందికి ఉంటుంది. అయితే అది అందరి వల్లా సాధ్యపడేది కాదు టాలెంట్ మాత్రమే ఉంటే చాలదు ఇంకా చాలా చాలా ఉండాలి. అలాంటి వాటిలో ఇటీవల బాగా చర్చనీయాంశం అవుతున్న విషయం సినీ పరిశ్రమలో అప్పటికే స్థిరపడిన కుటుంబాలు, వారికి సంబంధీకులకే తప్ప బయటివారికి అండా దండా లభించవనేది. అందువల్లే బయటివారికి సినిమా రంగంలో అంత త్వరగా అవకాశాలు రావని, ఏదోలా వచ్చినా సక్సెస్ అయినా కూడా స్థిరపడడం కష్టమేనని బయటి నుంచి ఆ రంగంలోకి వచ్చిన వారి ఆరోపణ.
అలా ఆరోపిస్తున్నవారిలో తాజాగా సీనియర్ నటి అమీషా పటేల్ కూడా చేరింది. కహోనా ప్యార్ హై సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు తెరంగేట్రం చేసిన ఈ నటి ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ సరసన బద్రి, నాని, నరసింహుడు, పరమవీర చక్ర..సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది.
ఆ తర్వాత అకస్మాత్తుగా సినిమాలకు దూరమైన అమీషా ఐదు సంవత్సరాల విరామం తర్వాత 2023లో సన్నీ డియోల్, ఉత్కర్ష్ శర్మతో కలిసి గదర్ 2 చిత్రంతో తిరిగి తెరపైకి వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర రూ.686 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆమె చివరిగా 2024లో విడుదలైన తౌబా తేరా జల్వా చిత్రంలో కనిపించింది. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రతికూల సమీక్షలు వచ్చాయి, కానీ అమీషా నటనకు మాత్రం ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత మళ్లీ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అమీషా ఇంతవరకూ ప్రకటించలేదు.
ఎన్ని హిట్ సినిమాల్లో చేసినా అమీషాకు రావాల్సినంత స్టార్ డమ్ రాలేదు. ఈ నేపధ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను టాప్ హీరోయిన్ కాకపోవడానికి కారణమైన సినిమా పరిశ్రమ పరిస్థితులపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్త పరచింది.
తన మనస్తత్వం కారణంగా సినీ పరిశ్రమ లోపలి వ్యక్తులు తనను ఇష్టపడరని అమీషా చెప్పింది, సినీరంగంలో రాణించాలంటే ఏదో ఒక శిబిరానికి చెందిన వారై ఉండాలంది. ‘ నేను శిబిరాలకు చెందినదానిని కాదు, వారితో పంచుకోవడానికి నాకు దురలవాట్లు లేవు. మందు తాగను, సిగిరెట్ త్రాగను లేదా పని కావాలని మస్కా–లగావో (కాకాపట్టడం లాంటివి) చేయను నా అర్హత ప్రకారం నాకు ఏది దొరికితే అది నాకు లభిస్తుంది. ఆ కారణంగా వారు నన్ను ఇష్టపడరు. అయినా సరే నేను లొంగిపోను.‘ అంటూ తేల్చి చెప్పేసింది.
తనకు తొలి చిత్రం అవకాశం కూడా అతి కష్టమ్మీద వచ్చిందని అంది. ‘కహో నా... ప్యార్ హై’ సినిమా కోసం తాను మొదటి ఎంపిక కాదని, తొలుత కరీనా కపూర్ ను ఎంచుకున్నారని తెలిపింది. అయితే నిర్మాత రాకేష్ రోషన్ కు కరీనా కపూర్‌తో విభేదాలు వచ్చాక ఆమె ప్రవర్తన పట్ల అసంతృప్తి వచ్చిన కారణంగా ఆమెను ఆ సినిమా నుంచి తొలగించిన తర్వాత మాత్రమే తనకు ఆ అవకాశం వచ్చిందని ఆమె గుర్తుచేసుకుంది.
పరిశ్రమ లో సన్నిహితుడో, భాగస్వామి లేనప్పుడు ఒంటరిగా అందులో ఇమడడం చాలా కష్టం అంటోందామె. ‘సినిమా పరిశ్రమకు చెందిన ఓ బాయ్‌ఫ్రెండ్ లేదా ఒక భర్త లేనప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మీరు పవర్ ఫుల్ కపుల్‌గా లో ’సగం’ కానప్పుడు రాణింపు చాలా కష్టం. ఎందుకంటే మీకు మద్దతు ఇచ్చే వ్యక్తులు ఉండరు. మిమ్మల్ని సమర్థించడానికి ఎటువంటి కారణం లేదు కదా ఆఫ్ట్రాల్.. మీరు బయటి వ్యక్తి.’’ అంటూ ఆమె వ్యాఖ్యానించింది.