
సైకాలజీ ఆధారిత సినిమాలు మానసిక ఆరోగ్య సమస్యల గురించి అవగాహన పెంచడంలో సహాయపడతాయి. వాటిని సమాజంలో చర్చించడానికి ఒక వేదికను అందిస్తాయి. ఒక వ్యక్తి చేస్తున్న పనుల వెనుక దాగిఉన్న సైకాలజీ ఏంటి అనేది అంత ఈజీగా ఎవరూ కనిపెట్టలేరు. ఒక్కోసారి వారు హత్యలు చేయవచ్చు లేదా ప్రాణ భయంతో బయటి ప్రపంచానికి దూరంగా ఉంటూ నేరాలు చేయవచ్చు. ఇలాంటి నిజజీవిత ఘటనలతో చాలా సినిమాలు వచ్చాయి. చైల్డ్ కౌన్సిలింగ్, సైకాలజికల్ థ్రిల్లర్, న్యూరోసైకాలజీ, క్లినికల్ సైకాలజీ ఇలా ఏదో ఒక మానసిక సమస్యను తీసుకుని కమర్షియల్ స్టైల్‌లో వెండితెరపై దర్శకులు చూపిస్తున్నారు. ఇలాంటి కథల వైపే ప్రేక్షకులు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్రాలు ఎక్కువగా ఇలాంటి కాన్సెప్ట్‌తోనే వస్తుంటాయి. నేటి సినిమాలను సైకాలజీ కథలే శాసిస్తున్నాయి. వాటి విజయాల శాతం కూడా చాలా ఎక్కువగానే ఉంటంది.
విక్రమ్- శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన అపరిచితుడు సినిమా సైకాలజీకి బలమైన సంబంధం ఉంది. ఈ చిత్రం ప్రధానంగా డిస్సోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ (Dissociative Identity Disorder – DID) అనే మానసిక సమస్య చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక వ్యక్తిలో బహుళ వ్యక్తిత్వాలు (multiple personalities) ఉత్పత్తి కావడం వల్ల కలిగే పరిస్థితి. అపరిచితుడు లాంటి వ్యక్తులు ప్రపంచంలో సుమారు 1.5 శాతం ఉన్నారని ఒక సర్వే పేర్కొంది.

"అపరిచితుడు"లో మూడు వ్యక్తిత్వాలు
- ముఖ్య పాత్ర రామానుజం – ఒక న్యాయవాది, సమాజంలో జరుగుతున్న అవినీతిని ఎదుర్కొంటూ మానసికంగా క్షోభకు లోనవుతాడు.
- అపరిచితుడు – అతని లోపల ఉన్న కోపం, న్యాయం కోసం పోరాటం, సమాజంపై విసుగు కలగజేసే వ్యక్తిత్వం.
- రెమో – అతని లోపలున్న సరదా, ప్రేమను వ్యక్తపరచే వ్యక్తిత్వం.
ఈ మూడు వ్యక్తిత్వాలు ఒకే వ్యక్తిలో ఉండటం, అతను వాటిని గుర్తించకపోవడం వల్ల సమాజంలో మంచి లేదా చెడు ఏదైనా జరగవచ్చని వైద్యులు చెప్తారు. అలాంటి వారికి మానసిక చికిత్స అవసరం. అపరిచితుడులో విక్రమ్ పాత్ర రామానుజం సామాజిక అవమానాలు ఎదుర్కొంటే మరో వ్యక్తిత్వంలోకి వెళ్లి గరుడ పురాణం ఆధారంగా శిక్షలు వేస్తుంటాడు. ప్రేమలో నిరాకరణ రావడంతో రెమోలా మారిపోయి తన కోరిక తీర్చుకుంటాడు. అయితే, ఇలాంటి సైకాలజీ వ్యక్తిత్వం ఉన్న వారు నేటి సమాజంలో చాలామంది ఉన్నారు. విక్రమ్ సతీమణి శైలజ (సైకాలజిస్ట్) కావడంతో ఆమె సలహాలు తనకు బాగా ఉపయోగపడ్డాయి. దీంతో సులువుగా మూడు వ్యక్తిత్వాలను వేరుగా ప్రదర్శించగలిగాడు. ఇది సినిమా సైకాలజీకి నిజమైన గౌరవం ఇచ్చిన అంశమని చెప్పవచ్చు.

క్లినికల్ సైకాలజీతో 'గజిని'
గజిని సినిమాకు సైకాలజీతో చాలా దగ్గరి సంబంధం ఉంది. ఈ చిత్రం మొత్తం అన్తెగ్రేడ్ అమ్నీషియా (Anterograde Amnesia) అనే మానసిక సమస్య చుట్టూ తిరుగుతుంది. దీంతో ఇబ్బంది పడేవారు వ్యక్తి గత సంఘటనలను మాత్రమే గుర్తుపెట్టుకోగలడు. కానీ, కొత్త సమాచారం, కొత్త సంఘటనలను మెమరీలో నిల్వ చేయలేడు. అంటే, అతను కొత్తగా జరిగే విషయాలను కొద్ది నిమిషాలకే మర్చిపోతాడు. గజినిలో సంజయ్ రామస్వామి పాత్రలో హీరో పరిస్థితి కూడా ఇంతే ఉంటుంది.
తన ప్రేయసి కల్పనను హత్య చేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకోవడానికి ఫోటోలు, టాటూలు, నోట్లు వంటివి ఉపయోగిస్తాడు. మానసికంగా తాను మర్చిపోకుండా ఉండేందుకు ఉపయోగించే పద్ధతులే ఇవి. ఇలా ఇబ్బంది పడేవారు చాలామందే ఉన్నారు. వారు పాటించే విధానం కూడా ఇదే తరహాలో ఉంటుంది. క్లినికల్ సైకాలజీలో ట్రామా తర్వాత వ్యక్తి ఎలా స్పందిస్తాడో అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెప్పవచ్చు. గజిని సినిమా ఒక మానసిక సమస్యను కమర్షియల్ స్టైల్‌లో చూపించి భారీ హిట్ అందుకున్నారు.

చైల్డ్ హుడ్ ఫోబియా, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌తో భగవంత్ కేసరి
సైకాలజీకి చాలా దగ్గరగా ఉండే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అనే అంశంతో భగవంత్ కేసరి చిత్రం వచ్చింది. ఈ సినిమా 71వ జాతీయ చలన చిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. - ఎడ్యుకేషనల్ సైకాలజీలో పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగానే వారి వయసును భట్టి వారికి అర్థం అయ్యేలా ఈ విషయం గురించి తెలపాలి. పిల్లల భద్రతను, భావోద్వేగాలను, వ్యక్తిత్వాన్ని పరిరక్షించేందుకు ఇది ఒక సైకాలజికల్ టూల్‌లా ఉపయోగపడుతుంది.
చైల్డ్ హుడ్ ఫోబియా (Childhood Phobia)తో కథానాయిక విజయలక్ష్మి (విజ్జి) చిన్నతనంలో జరిగిన సంఘటనల వల్ల ఆర్మీలో చేరే విషయంలో భయం కలిగి ఉంటుంది. ఈ భయాన్ని అధిగమించేందుకు సైకాలజిస్ట్ డాక్టర్ కాత్యాయనీ పాత్రను ప్రవేశపెట్టడం, మానసిక చికిత్స (therapy) ప్రాధాన్యతను చూపిస్తుంది. ఈ కాన్సెప్ట్‌లో వచ్చే సీన్లు మనకు కూడా ఆసక్తిని కలిగిస్తాయి.
రాక్షససుడుకి సైకాలజీతో సంబంధం
రాక్షససుడు సినిమా కథలో ఒక సైకో కిల్లర్ స్కూల్ వయస్సు అమ్మాయిలను టార్గెట్ చేస్తూ వరుస హత్యలు చేస్తుంటాడు. హీరో అరుణ్ (SI) ఈ కేసును చేధించే క్రమంలో, అతను ఈ నేరాలు ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి చేస్తున్నట్లు గుర్తిస్తాడు. సైకోపతీ (Psychopathy) నేరస్తుడు ఎమోషనల్ ఎంపతీ లేకుండా, ప్లానింగ్‌తో హత్యలు చేస్తాడు. అరుణ్ నేరస్తుడి మానసిక స్థితిని అర్థం చేసుకొని, అతని ప్రవర్తన ఆధారంగా కేసును చేధిస్తాడు. ఈ సినిమా సైకాలజీ, నేర పరిశోధన, మానవ ప్రవర్తన అంశాలను మనకు గుర్తుచేస్తాయి. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ భారీ విజయాన్ని అందుకున్నారు.

సైకాలజీతో హిట్
హిట్ సినిమా కథలో SP అర్జున్ సర్కార్ అనే పోలీస్ అధికారి, ఒక పెడోఫైల్‌ను హత్య చేసి, ఆ కేసును తానే విచారించాల్సిన పరిస్థితిలో పడతాడు. అతని ప్రవర్తన, హత్యల పద్ధతులు, మానసిక స్థితి వంటి అంశాలు అన్ని కూడా సైకాలజీతో ముడిపడే ఉంటాయి. ఇందులో నాని పాత్ర చేసే చర్యలు సైకోపతిక్ టెండెన్సీలు, ట్రామా-బేస్డ్ బిహేవియర్‌ను సూచిస్తాయి. అంటే తనే నేరం చేసి మరో నేరస్థుడిని పట్టుకోవడం. ఈ మూవీ కూడా సైకాలజీ కాన్సప్ట్‌తో నిర్మించి ప్రేక్షకులను మెప్పించారు. ఒక మనిషి జీవితం సైకాలజీతో చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఇలాంటి కథలు వెండితెరపైకి వచ్చినప్పుడు వాటిని ఆసక్తిగా గమనిస్తాడు.. ఒక్కోసారి తన చుట్టూ ఉండే వారి జీవితాలతో పోల్చి సరిచూస్తాడు కూడా.. ఈ కారణం వల్లే ఇలాంటి సైకాలజీ కథలు హిట్ అవుతున్నాయి.
-సాక్షి వెబ్ ప్రత్యేకం