నెంబర్‌వన్‌.. అల్లు అర్జున్‌ ఆలోచన అదేనా? | Allu Arjun Lines Up Films With Top Indian Directors, Focus On Number One Position | Sakshi
Sakshi News home page

2030 దాకా నేనే నెంబర్‌వన్‌.. అల్లు అర్జున్‌ ఆలోచన అదేనా?

Apr 12 2026 4:19 PM | Updated on Apr 12 2026 4:30 PM

Allu Arjun Lines Up Films With Top Indian Directors, Focus On Number One Position

స్టార్స్‌ జీవితంలో ఒక భారీ విజయం దక్కడం సులభమే కావచ్చు... కానీ దానిని నిలబెట్టుకోవడం కొనసాగించడం మాత్రం అంత సులభం కాదు.  టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్‌ డమ్‌ అనేది చాలా అస్థిమితంగా మారింది. ఖచ్చితంగా నెంబర్‌ వన్‌ హీరో ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రేక్షకులు ఒక్కో ఏడాది ఒక్కో హీరో చిత్రానికి పట్టం కడుతుండడంతో నెంబర్లాట దోబూచులాటగా  మారుతోంది.

ఈ పరిస్థితిలో ప్రస్తుతానికి మాత్రం ఇటు కలెక్షన్స్‌ పరంగా చూసినా అటు రెమ్యునరేషన్‌ పరంగా చూసినా, అల్లు అర్జున్‌ నెం1గా నిలుస్తున్నాడనేది నిర్వివాదం. తాజాగా  అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన చిత్రం ’రాకా’ కోసం ఏకంగా రూ.300 కోట్ల వరకూ రెమ్యునరేషన్‌ తీసుకుని సమకాలీన హీరోల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు బన్నీ.  ఎవరూ ఊహించని విధంగా అప్పటి వరకూ 5, 6 స్థానంలో ఉన్న స్టైలిష్‌ స్టార్‌ కాస్తా  ఒక్క ఉదుటున నెం1 ఐకాన్‌ స్టార్‌గా చేసింది పుష్పరాజ్‌ పాత్ర. 

ప్రస్తుతం అల్లు అర్జున్‌ హవా నడుస్తున్నప్పటికీ ఇది వన్‌ సినిమా వండర్‌ అనీ త్వరలోనే మరో టాప్‌ హీరో నెం1 ఛెయిర్‌ని ఆక్రమిస్తాడని సినీ పండితుల్లో పలువురు భావిస్తున్నారు. మరోవైపు బన్నీ మాత్రం ఈ ఊహాగానాలను పటాపంచలు చేయాలని, తన స్టార్‌ డమ్‌ని మరింత పెంచే విధంగా పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. కనీసం 2030 వరకూ తన ప్లేస్‌ని శాశ్వతం చేసుకునేలా తదుపరి ప్రాజెక్టులను ఆయన జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు.

పుష్ప తర్వాత అల్లు అర్జున్‌ ఎంపికలు చూస్తే ఆ విషయం సులభంగా అర్ధమవుతుంది. జవాన్‌ లాంటి భారీ హిట్‌ ఇచ్చిన అట్లీని తన తదుపరి సినిమాకు ఎంపిక చేసుకోవడం ద్వారా తన భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత దక్షిణాదిలో భారీ హిట్స్‌కి కేరాఫ్‌గా నిలిచిన లోకేష్‌ కనగరాజ్, అదే విధంగా మళయాళ పరిశ్రమకు చెందిన బాసిల్‌ జోసెఫ్‌లను ఐకాన్‌ స్టార్‌ జోడీ కట్టడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. 

అంతేకాకుండా   అల్లు అర్జున్‌ ప్రశాంత్‌ నీల్, సందీప్‌ రెడ్డి వంగా వంటి ప్రముఖ దర్శకులతో సైతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం, అతని రాబోయే ప్రాజెక్ట్‌లతో ముడిపడి ఉన్న ఇతర పేర్లలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా ఉన్నారు.   మొత్తంగా చూస్తే విభిన్నమైన జానర్‌ల మిశ్రమాన్ని అందించడం ద్వారా   భారతీయ చిత్రసీమలో తనదైన హవాను ఆయన కొనసాగించాలని ఆలోచిస్తున్నట్టు అర్ధం అవుతుంది.

ఉత్కంఠభరితమైన కథనాలకు చిరునామా లాంటి సందీప్‌ రెడ్డి వంగా , విభిన్న తరహా యాక్షన్‌ విన్యాసాలకు  కేరాఫ్‌ లాంటి ప్రశాంత్‌ నీల్‌ , జనరంజక చిత్రాలకు పేరొందిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ విలక్షణమైన శైలికి మరోపేరు లాంటి బాసిల్‌ జోసెఫ్, వైవిధ్యభరిత హీరోచిత కధలను తెరకెక్కించే లోకేష్‌ కనగరాజ్‌ ల  వరకు ఆయన ఎంపిక వెనుక ఆలోచనల గాఢతను మనకు తెలియజెబుతాయి. 

ఈ దర్శకుల చిత్రాలు కమర్షియల్‌ సక్సెస్‌కు గ్యారెంటీతో పాటు అవకాశాన్ని బట్టి సెన్సేషన్‌ను కూడా సృష్టించగలవు. అయితే రానున్న రోజుల్లో ఇప్పటికే నెం1 కుర్చీకి అత్యంత సమీపంలో ఉంటూ, స్పిరిట్‌ వంటి  సినిమాలతో దూసుకొస్తున్న ప్రభాస్‌ , రాజమౌళి సినిమా ద్వారా మహేష్‌ బాబు...లతో పాటు పలువురు టాప్‌ హీరోలు బన్నీ దక్కించుకున్న స్థానానికి గట్టి పోటీని ఇవ్వడం ఖాయం. వీటిని తిప్పికొట్టేలా బన్నీ ఎంపికలు ఉంటాయా లేదా అనేది త్వరలోనే తేలుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement