
650 మంది స్టంట్ వర్కర్స్‌కి బీమా చేయించిన అక్షయ్ కుమార్
వెండితెరపై మంచి పనులు చేసి, హీరో అనిపించుకుంటారు స్టార్స్. అది ‘రీల్ హీరో’. అదే తెర వెనుక మంచి పనులు చేస్తే ‘రియల్ హీరో’ అనిపించుకుంటారు. ఇప్పుడు అక్షయ్ కుమార్‌ని అందరూ ‘రియల్ హీరో అంటే మీరే’ అంటున్నారు. మరి... 650 మంది స్టంట్‌మెన్, ఉమెన్‌కి బీమా చేయిస్తే ఆ మాత్రం అభినందించాల్సిందే కదా. ఇటీవల తమిళ చిత్రం ‘వేట్టువం’ షూటింగ్‌లో స్టంట్ మేన్ రాజు గుండెపోటుతో మరణించారు. ఆర్య హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కారుతో స్టంట్స్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.
మామూలుగా ఫైట్ సీన్స్ చిత్రీకరించేటప్పుడు కూడా ప్రమాదాలకు గురై, స్టంట్ వర్కర్స్ మరణిస్తుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అక్షయ్ కుమార్ తాజాగా 650 మంది స్టంట్ మెన్, ఉమెన్‌కి బీమా చేయించారు. ఈ విషయం గురించి బాలీవుడ్ స్టంట్ మాస్టర్ విక్రమ్ సింగ్ స్పందిస్తూ – ‘‘మీరు (అక్షయ్‌ని ఉద్దేశించి) చేసిన ఈ మంచి పని వల్ల బాలీవుడ్‌లో 650 మంది స్టంట్ వర్కర్స్ బీమా పరిధిలోకి వచ్చారు.
ఈ ఇన్సూరెన్స్ పాలసీలో రూ. 5 లక్షల నుంచి 5.50 లక్షల వరకూ నగదురహిత చికిత్స పొందే వెసులుబాటు ఉంది. అది షూటింగ్ సెట్‌లో అయినా విడిగా అయినా. మీకెలా ధన్యవాదాలో చె΄్పాలో తెలియడంలేదు అక్షయ్ సార్’’ అని పేర్కొన్నారు.