
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడనున్నాయి. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ (ఓజీ), బాలకృష్ణ (అఖండ 2) విడుదల కానున్నాయి. ఇప్పటికే రెండు సినిమాల నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద మొదటిసారి పవన్‌తో బాలయ్య పోటీ పడుతుండటంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య మరోసారి బాక్సాఫీస్ లెక్కలపై చర్చ జరగనుంది. దసరా విజేతగా ఎవరు నిలుస్తారో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ పోటీ నుంచి బాలయ్య తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇండస్ట్రీలో బలంగానే వార్తలు వినిపిస్తున్నాయి.
రెండు భారీ బడ్జెట్ చిత్రాల మధ్య పోటీ ఎందుకనే 'అఖండ'నే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఆపై అఖండ2 ప్రాజెక్ట్తో పాన్ ఇండియా రేంజ్లో విజయం సాధించాలని దర్శకుడు బోయపాటి పక్కా ప్రణాళికతో ఉన్నారు. అందులో భాగంగానే ఈ సినిమా గ్రాఫిక్స్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం కేటాయించాలని ఆయన ఆలోచిస్తున్నారట. ఆపై ఇంకా కొంత భాగం షూటింగ్ పనులు కూడా పెండింగ్లో ఉన్నాయట. 2021 డిసెంబర్లో అఖండ విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడు సీక్వెల్ కూడా డిసెంబర్ నెలలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట.
అఖండ2 చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా సంయుక్త (Samyuktha) నటిస్తోంది. ఓజీ' సినిమాను రూ. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా అత్యంత బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాలు ఒకేరోజు విడుదలైతే తప్పకుండా థియేటర్స్ విషయంలో ఇబ్బందులు రావచ్చు. అందుకే ఎవరో ఒకరు తమ సినిమాను వాయిదా వేసుకుని, నిర్మాణ పరంగా మరింత బలంగా తెరకెక్కించి కొత్త తేదీన విడుదల చేయడం బెటర్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.