సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాల్లో ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలు నటించడం కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతోంది. అశ్వత్ మారిముత్తు డైరెక్షన్‌లో, కమల్ హాసన్ నిర్మాతగా రజినీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ధర్మన్‌లో తెలుగు యువ హీరో రామ్ పోతినేని నటించబోతున్నాడు. అయితే ఇది నెట్టింట మరో రచ్చకు దారి తీసింది.
రజనీకాంత్ అల్లుడిగా కనిపిస్తాడా? లేక విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పిస్తాడా? అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమాలో రామ్‌కు జోడీగా రాశీఖన్నా నటించనున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. దీంతో ఇప్పటికే సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరోవైపు రజనీ సినిమాలో రామ్ లాంటి తెలుగు స్టార్ నటించడంపై అభిమానుల్లోనూ భిన్నమైన చర్చ జరుగుతోంది.
నాగ్ తర్వాత రామ్ వంతు?
లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. నాగార్జున పోషించిన సైమన్ పాత్రపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత ఆ పాత్రకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. నాగార్జున లాంటి స్టార్‌ను.. మరీ చీప్‌గా ప్రజెంట్ చేయడంపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే చాలా గ్యాప్ తర్వాత రజనీ ‘వెట్టైయాన్’ చిత్రంలో నటించిన రానాకు కూడా ప్లాపే పడింది.
ఇప్పుడు అదే నేపథ్యంలో రామ్ పేరు తెరపైకి రావడంతో.. ‘రానా, నాగ్ తర్వాత ఇప్పుడు రామ్ వంతా?’ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రజనీ సినిమాలో పాత్రకు సరైన ప్రాధాన్యం లేకపోతే మాత్రం అది రామ్ కెరీర్‌కు పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది.
పాపం.. రామ్
రామ్ పోతినేనికి ఈ సినిమా కీలకంగా మారే అవకాశముంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఆయనకు ఆ స్థాయిలో విజయం దక్కలేదు. వారియర్ పేరిట ద్విభాషా చిత్రం చేసినా ఆడలేదు. పైగా సంజయ్ దత్, ఉపేంద్ర వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేసినా.. రామ్ కెరీర్‌కు మాత్రం పెద్దగా బూస్ట్ రాలేదు. దీంతో స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏకంగా రజనీకాంత్ సినిమాలో అవకాశం రావడం ఆయనకు పెద్ద ప్లస్ అవుతుందనే అభిప్రాయం ఒకవైపు ఉంది. రజనీ సినిమాకు ఉన్న క్రేజ్, పాన్ ఇండియా మార్కెట్ దృష్ట్యా రామ్‌కు కొత్త ప్రేక్షకులను చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే.. తేడా కొడితే పరిస్థితి ఏంటన్నదానిపైనా జోరుగా చర్చ నడుస్తోంది.
రజనీకీ అంతే..
మరోవైపు రజనీకాంత్ కెరీర్‌లోనూ ప్రతి సినిమా ఇప్పుడు కీలకమే. ‘జైలర్’కు ముందు, కూలీ కూడా ఆశించిన స్థాయిలో చిత్రాలేవీ ఆడలేదు. రెమ్యునరేషన్ ఆకాశాన్ని అంటుతూ.. కలెక్షన్లు రాక నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రజనీ తదుపరి చిత్రాలు(జైలర్-2, ధర్మన్ చిత్రాలు) కచ్చితంగా హిట్లు కావాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని తమిళంలో నటించడం.. ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు మన దగ్గరా చర్చకు దారి తీసింది.


