Bollywood Actor Rajiv Kapoor: Interesting And Unknown Facts About His Life - Sakshi
Sakshi News home page

చింపూ కపూర్‌ ఓడి వెళ్లిపోయాడు

Published Wed, Feb 10 2021 8:17 AM

Actor Rajiv Kapoor Interesting Facts About His Life - Sakshi

రాజ్‌కపూర్‌ ముగ్గురు కుమారుల్లో రిషి కపూర్‌ హీరోగా హిట్‌ అయ్యాడు. రణ్‌ధీర్‌ కపూర్‌ హీరోగా రాణించకపోయినా తన కుమార్తెల వల్ల గుర్తింపు పొందుతున్నాడు. ‘చింపూ కపూర్‌’ అని అందరూ పిలిచే రాజీవ్‌ కపూర్‌ నటుడిగా రాణించలేదు. దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఫ్లాప్‌ అయ్యాడు. ఆల్కహాల్‌కు బానిసయ్యి 58 ఏళ్లకు మంగళవారం (ఫిబ్రవరి 9)న హార్ట్‌ ఎటాక్‌తో మరణించాడు. ఒక ఇంట పుట్టినవారందరికీ ఒకే రకమైన అదృష్టం దక్కాలని లేదు. కొందరు లేస్తారు. కొందరు పడతారు. పృథ్వీరాజ్‌ కపూర్‌కు జన్మించిన ముగ్గురు కుమారుల్లో రాజ్‌ కపూర్‌ ఒక్కడే వెంటనే హిట్‌ హీరో అయ్యాడు. షమ్మీ కపూర్, శశికపూర్‌ చాలా స్ట్రగుల్‌ చేయాల్సి వచ్చింది. స్ట్రగుల్‌ చేసి నిలబడ్డారు. కాని రాజ్‌కపూర్‌కు జన్మించిన ముగ్గురు కొడుకుల్లో రిషి కపూర్‌ ఒక్కడే హిట్‌ హీరో అయ్యాడు. రణ్‌ధీర్‌ కపూర్‌ కాలేకపోయాడు. స్ట్రగుల్‌ చేసి నిలబడలేకపోయాడు.

అలాగే ఆఖరు కొడుకు రాజీవ్‌ కపూర్‌ కూడా హిట్‌ హీరో కాలేకపోయాడు. స్ట్రగుల్‌ చేసి నిలబడలేకపోయాడు. రాజీవ్‌ కపూర్‌ను అందరూ చింపూ కపూర్‌ అని పిలిచేవారు. 20 ఏళ్లు వచ్చేసరికి బాలీవుడ్‌లో అతన్ని హీరోగా పెట్టి సినిమాలు తీయడం మొదలెట్టారు. అతని మొదటి సినిమా ‘ఏక్‌ జాన్‌ హై హమ్‌’ (1983). ఆ సినిమాలో షమ్మీ కపూర్‌ అతనికి తండ్రిగా నటించాడు. సినిమాలో రాజీవ్‌ కపూర్‌ కూడా అచ్చు షమ్మీ కపూర్‌లానే ప్రేక్షకులకు కనిపించాడు. షమ్మీ కపూర్‌ను నటనలో అనుకరించడంతో రాజీవ్‌ కపూర్‌ మీద షమ్మీ కపూర్‌ నకలు అనే ముద్రపడింది. దాంతో 1985 లో అతణ్ణి గట్టెక్కించడానికి రాజ్‌కపూర్‌ రంగంలోకి దిగాడు. తను తీస్తున్న ‘రామ్‌ తేరి గంగా మైలీ’లో హీరోగా బుక్‌ చేశాడు. ఆ సినిమాలో మందాకిని హీరోయిన్‌. పాటలు రవీంద్ర జైన్‌ చేశాడు.

జలపాతంలో అర్ధనగ్నంగా ఛాతీ కనిపించేలా మందాకిని చేసిన పాట దుమారం రేపింది. సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. అంతే కాదు రాజీవ్‌ కపూర్‌ మీద ఉన్న షమ్మీ కపూర్‌ ముద్రను చెరిపేసింది. ఆ తర్వాత రాజీవ్‌ కపూర్‌ ‘ఆస్మాన్‌’, ‘జబర్దస్త్‌’లాంటి సినిమాలు చేశాడు. ఏవీ ఆడలేదు. ‘హెన్నా’ సినిమా సగంలో ఉండగా రాజ్‌కపూర్‌ మరణించగా రణ్‌ధీర్‌ కపూర్‌ దర్శకత్వం వహించాడు. రాజీవ్‌ కపూర్‌ నిర్మాతగా వ్యవహరించాడు. ‘హెన్నా’ హిట్‌ అయ్యింది. ఆ తర్వాత రాజీవ్‌ కపూర్‌ ‘ప్రేమ్‌గ్రంథ్‌’ సినిమాకు దర్శకత్వం వహించాడు. అది ఫ్లాప్‌ అయ్యింది. రిషి కపూర్‌ను దర్శకుడుగా పెట్టి ‘ఆ అబ్‌ లౌట్‌ చలే’ నిర్మించాడు. అదీ ఆడలేదు. ఆ తర్వాత రాజీవ్‌ కపూర్‌ ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.

రాజీవ్‌ కపూర్‌ పూణెలో తన బంగ్లాలో నివసించేవాడు. అతని పెళ్లి ఆర్తి సబర్వాల్‌ అనే ఆర్కిటెక్ట్‌తో 2001లో జరిగింది. అయితే రెండేళ్లకు మించి ఆ వివాహం నిలువలేదు. 2003లో వాళ్లు డివోర్స్‌ తీసుకున్నారు. గత సంవత్సరం లాక్‌డౌన్‌ వచ్చాక రాజీవ్‌ కపూర్‌ ముంబై చెంబూర్‌లోని రణ్‌ధీర్‌ కపూర్‌ దగ్గరకు వచ్చి నివసించ సాగాడు. హార్ట్‌ఎటాక్‌ వచ్చినప్పుడు రణ్‌ధీర్‌ కపూరే ఆస్పత్రిలో చేర్చాడు. కాని ఫలితం లేకపోయింది. కపూర్‌ ఫ్యామిలీని విషాదంలో ముంచుతూ రాజీవ్‌ కపూర్‌ వీడ్కోలు తీసుకున్నాడు.  

చదవండి: ఆమిర్‌ ఖాన్ అందుకే మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌

ఉత్తరాఖండ్‌ విలయం.. గొంతెత్తిన దియా మిర్జా

Advertisement
Advertisement