ఐసీయూలో నటుడు; ఆర్థికసాయం కోసం ఎదురుచూపులు

Actor Faraaz Khan On Ventilator Support Needs Funds For Treatment - Sakshi

దీనస్థితిలో నటుడి కుటుంబం.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు

ముంబై: బాలీవుడ్‌ నటుడు ఫరాజ్‌ ఖాన్‌(46) ఆరోగ్య పరిస్థితి విషమించింది. చెస్ట్‌, బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్న ఆయనను బెంగళూరులోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత వారం రోజులుగా ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఫరాజ్‌ చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చైందని, ఆర్థికంగా తమ పరిస్థితి బాగా లేనందున సహాయం అందించాల్సిందిగా కోరుతూ ఆయన సోదరుడు ఫామాన్‌ ఖాన్‌ విరాళాల సేకరణకు ఉపక్రమించారు. ఈ మేరకు ఫండ్‌రైజింగ్‌ ప్లాట్‌ఫాంలో తమ దీనస్థితిని వివరిస్తూ సుదీర్ఘ పోస్టు షేర్‌ చేశాడు. (చదవండి: 13 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు: సోనూ)

‘‘చాలా ఏళ్ల క్రితమే తన సినీ కెరీర్‌ ముగిసిపోయింది. ప్రస్తుతం తనొక చిన్న జాబ్‌ చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. ట్రీట్‌మెంట్‌ కోసం రూ. 25 లక్షలు అవసరం. అంతపెద్ద మొత్తం భరించడం ఆ కుటుంబానికి తలకు మించిన భారం. ఐసీయూలో అచేతన స్థితిలో పడి ఉన్న ఫరాజ్‌ ఖాన్‌ను రక్షించేందుకు వైద్యులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. మరో వారం నుంచి పది రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచాలని చెప్పారు. అయితే అందుకు అవసరమైన డబ్బు ఫరాజ్‌ కుటుంబం వద్ద లేదు. మాది సాదాసీదా కుటుంబం. ఉద్యోగం చేసుకుంటూ, వారాంతాల్లో కుటుంబంతో కలిసి సంతోషంగా గడపడమే మాకు తెలుసు. అలాంటిది ఇంత పెద్ద కష్టం నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. భాయ్‌ ఇంకా వెంటిలేటర్‌ మీదే ఉన్నాడు. దయచేసి సహాయం చేయండి’’ అంటూ విజ్ఞప్తి చేశాడు. బుధవారం నాటికి  రెండున్నర లక్షల రూపాయల సాయం అందినట్లు పేర్కొన్నాడు.

ఇక ఇందుకు స్పందించిన సీనియర్‌ నటి పూజా భట్‌, తన వంతు సాయం చేశానని, వీలైతే మీరు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తోచిన సాయం చేయాలంటూ తన ఫాలోవర్లకు సూచించారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. కాగా దివంగత నటుడు యూసఫ్‌ ఖాన్‌ కుమారుడైన ఫరాజ్‌ ఖాన్‌, మెహందీ, పృథ్వీ, దుల్హన్‌ బనో మై తేరీ, ఫరేబ్‌ వంటి సినిమాల్లో నటించాడు. ష్‌ కోయీ హై, రాత్‌ హోనే కో హై, సింధూర్‌ తేరే నాహ్‌ కా వంటి టీవీ షోలతోనూ మంచి గుర్తింపు పొందాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top