చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పరప్పన జైల్లో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్‌ను 57వ సీసీహెచ్ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. దర్శన్ నీలం రంగు టీ షర్ట్, నల్ల ప్యాంట్ ధరించి హాజరయ్యారు. అభ్యంతరాలు ఉంటే దాఖలు చేయాలని దర్శన్ తరఫు న్యాయవాదికి సూచించారు. జైలులో చలి ఎక్కువగా ఉన్నందున ఇంటి నుంచి తెచ్చిన దుప్పటిని కప్పుకోవడానికి ఇప్పించాలని ఆయన కోరారు.
మరో నిందితుడు నాగరాజు కూడా ఇదే కోరాడు. అయితే, జడ్జి ముందు దర్శన్ ఇలా వాపోయాడు. 'చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర పోవడమే సాధ్యం కావడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం అదనంగా ఒక కంబళి ఇప్పించండి.' అని వేడుకున్నాడు. అయితే, జైలు అధికారుల తీరుపై జడ్జి మండిపడ్డారు. 'చలి ఎక్కువగా ఉన్నప్పుడు అదనంగా కంబళి ఇవ్వాలి కదా.. ఇప్పటికే ఆదేశించాం కదా.. పదేపదే ఎందుకు చెప్పించుకుంటున్నారు..? నిందితులకు కావలసిన అదనపు కంబళ్లను ఇవ్వండి.' అని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు.
జైలు వీడియోల కేసులో భార్య పేరు
పరప్పన జైల్లో ఖైదీలకు రాచమర్యాదల వీడియో లీకేజీలో దర్శన్ సతీమణి విజయలక్ష్మి పేరు బయటకు వచ్చింది. దర్శన్ మిత్రుడు, నటుడు ధన్వీర్‌ను వీడియోల గురించి పోలీసులు విచారిస్తున్నారు. మొదట ఆ వీడియో న్యాయవాది ద్వారా తనకు రాగా, అదే వీడియోను తాను దర్శన్ భార్యకు పంపానని ధన్వీర్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. తాను ఈ వీడియోలను వైరల్ చేయలేదు, ఎవరు చేశారో తెలియదని పేర్కొన్నట్లు తెలిసింది. ఆమెకు కూడా నోటీసులిచ్చి విచారించాలని పరప్పన అగ్రహార పోలీసులు నిర్ణయించారు. ఈ వీడియోలను ఎవరు అప్‌లోడ్ చేశారో చెప్పాలంటూ ఫేస్‌బుక్‌కు పోలీసులు ఈ మెయిల్ ద్వారా అడిగినట్లు తెలిసింది.


