మెగాస్టార్ చిరంజీవి 35 ఏళ్ల క్రితం నటించిన యాక్షన్, అడ్వెంచర్ చిత్రం ‘కొదమసింహం’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 1990లో విడుదలైన ఈ సినిమా ఈ నెల 21న రీ–రిలీజ్ కానుండటంతో హైదరాబాద్‌లో ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. షో అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు మురళీ మోహన్ రావు, సంగీత దర్శకుడు కోటి తో పాటు చిత్ర బృందం అందరు పాల్గొన్నారు.
కాగా స్పెషల్ వీడియో ద్వారా స్పందించిన చిరంజీవి మాట్లాడుతూ.. "కౌబాయ్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కానీ అలాంటి పాత్రలో నేను నటిస్తానని అసలు ఊహించలేదు" అని అన్నారు. ‘కొదమసింహం’ తన సినీ కెరీర్‌లోనే ఒక ప్రత్యేక చిత్రం అని, ఆ కాలంలో ఒక కొత్త జానర్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన మూవీగా పేర్కొన్నారు. 
‘కొదమసింహం’ ఈసారి కూడా థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ పొందాలని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. రీమాస్టర్ చేసిన విజువల్స్, మెరుగైన సౌండ్ క్వాలిటీతో ఈ రీ–రిలీజ్ థియేటర్లలో ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని నిర్వాహకులు తెలిపారు.


